ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కృషి:డిప్యూటీ సీఎం పవన్ 

Spread the love

ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. ఆలయాల పవిత్రతను కాపాడటంతోపాటు  దేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు.  విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని నేడు వర్చువల్ గా పవన్ ప్రారంభించారు. సీతారాముని పేట కూడలి నుంచి నీలాచలం కొండ వరకు రూ.3.40 కోట్ల ఉపాధి హామీ నిధులతో 3.70 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ  పుణ్యక్షేత్రాల్లో రామతీర్థం ఒకటి. ఈ క్షేత్రంలో రామాయణ, మహా భారత కాలం నాటి ఆనవాళ్లు ఉన్నాయి.  అంతటి పవిత్రత కలిగిన రామతీర్ధం కొండ చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేస్తే ముక్తిని పొందుతారన్నది భక్తుల నమ్మిక. అందుకే వైకుంఠ ఏకాదశి, శివరాత్రి పర్వదినాల్లో బోదికొండగా పిలుచుకునే రామతీర్ధం గిరి చుట్టూ వేలాది మంది భక్తులు ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకుంటారని పేర్కొన్నారు. రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం గతంలో రాళ్లు, రప్పలు, ముళ్ల కంపలతో నిండి ఉండేదని గిరిప్రదక్షిణకు వచ్చే భక్తులు కష్టమైనా ఆ మార్గంలోనే నడిచేవారని  ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే  శ్రీమతి లోకం మాధవితో పాటు కొందరు భక్తులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు.  సీఎం చంద్రబాబు  నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆలయాల పవిత్రతను సంరక్షించే చర్యల్లో భాగంగా రామతీర్ధం కొండ చుట్టూ రోడ్డు నిర్మించే బాధ్యత తీసుకున్నట్లు తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ. 3.40 కోట్లు వెచ్చించి గిరిప్రదక్షిణ మార్గంలో బీటీ రోడ్డు నిర్మించినట్లు తెలిపారు.  అధికారుల సహకారంతో శ్రీరామ నవమికి రెండు రోజుల ముందే రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఇదే రామతీర్ధం పుణ్యక్షేత్రంలో రాములవారి విగ్రహం శిరచ్ఛేదం చేస్తే కోట్లాది మంది హిందువు భక్తులు బాధకి గురయ్యారన్న పవన్ ఆ ఘటన తీవ్ర వేదన కలిగించిందని అన్నారు. ఈ రోజున ఆలయానికి గిరి ప్రదక్షిణ మార్గాన్ని సుందరంగా నిర్మించడం ద్వారా స్వామిని ఈ రూపంలో సేవించుకునే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సంస్కృతి సంప్రదాయాలను కూటమి ప్రభుత్వం కాపాడుతుందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు లోకం మాధవి, పూసపాటి అదితి విజయలక్ష్మి పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *