ఇంధన భద్రతపై ఆందోళన నెలకొన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకుని, క్రూడాయిల్ ధరలు మండిపోతున్న వేళ.. దేశీయంగా భారాన్ని తగ్గించేందుకు ఎక్సైజ్ సుంకాన్ని భారీగా కోత విధిస్తూ ప్రకటన విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో కొంత ఊరట కలిగించనుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరల పెరుగుదలకు ప్రధాన కారణమవుతున్న ఇంధన ధరలను అదుపులోకి తెచ్చేందుకు ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు, రవాణా రంగంపై నేరుగా ప్రభావం చూపే డీజిల్ ధరల విషయంలో కేంద్రం మరింత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. గతంలో డీజిల్పై లీటరుకు 10 రూపాయలుగా ఉన్న ఎక్సైజ్ పన్నును ఇప్పుడు పూర్తిగా ఎత్తివేసింది. అంటే డీజిల్పై కేంద్రం వసూలు చేసే సుంకం ఇప్పుడు ‘జీరో’ . రవాణా ఖర్చులు తగ్గితే, నిత్యావసర వస్తువుల ధరలు కూడా అదుపులోకి వస్తాయన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ వాతావరణం కారణంగా ముడి చమురు సరఫరాపైసర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇక గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగితే, దేశీయంగా లీటర్ ధర 150 రూపాయలు దాటుతుందేమో అన్న భయాందోళనలు కనిపిస్తున్న ఇలాంటి క్లిష్ట సమయంలో కేంద్రం తన ఆదాయాన్ని వదులుకుని మరీ పన్నులు తగ్గించడం గమనార్హం. అయితే, ఈ పన్ను తగ్గింపు ప్రయోజనం పూర్తిస్థాయిలో సామాన్యుడికి అందాలంటే.. ఆయిల్ కంపెనీలు (OMCs) పాత్ర కీలకం. కేంద్రం తగ్గించిన ఈ సుంకాన్ని ఆయిల్ కంపెనీలు వెంటనే వినియోగదారులకు బదిలీ చేస్తే, దేశంలోని ప్రధాన నగరాల్లో లీటర్ ధర భారీగా తగ్గనుంది.