ఈసారి ‘గద’ తో అదరగొట్టబోతున్న మన చరణ్..!

Spread the love

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’  ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో చరణ్ కనిపించిన కొత్త లుక్ అభిమానులను మాత్రమే కాదు, సినీ ప్రేమికులందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రామీణ క్రికెటర్‌గా కనిపించిన ఆయన ఒక్కసారిగా పహిల్వాన్‌లా మారిపోయిన విధానం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా చరణ్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన పహిల్వాన్ గ్లింప్స్ లో ఆయన కనిపించిన విధానం  ఇప్పుడు ఇంటర్నెట్ అంతా హాట్ టాపిక్ గా మారింది. మట్టి లో కుస్తీలు పడుతూ, పవర్ ఫుల్ బాడీ లాంగ్వేజ్ తో  కనిపించిన చరణ్ లుక్ నిజంగా అభిమానులకు కొత్త అనుభూతిని ఇచ్చింది.

ఈ లుక్ కోసం చరణ్ చేసిన కష్టం గురించి ఇప్పుడు ఆసక్తికరమైన వివరాలు బయటకు వస్తున్నాయి. సాధారణంగా సినిమాలో ఒక కొత్త లుక్ కోసం నటులు కొంత ట్రైనింగ్ తీసుకుంటారు. కానీ చరణ్ మాత్రం ఈ పాత్ర కోసం ఎనిమిది నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నారని సమాచారం. ప్రతి రోజు తెల్లవారుజామున 5:30 గంటలకు లేచి వ్యాయామం ప్రారంభించేవారట. ఫిట్‌నెస్ ట్రైనింగ్, కుస్తీ సాధన, శరీరానికి అవసరమైన ప్రత్యేక వ్యాయామాలు ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఆయన ఈ లుక్‌ను సాధించారు. ఒక పహిల్వాన్‌కు ఉండే శక్తి, దృఢత్వం, భంగిమ అన్నీ తనలో కనిపించేలా ఆయన తన శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నారు.

ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే… ఈ శరీరాకృతిని చరణ్ పూర్తిగా శాఖాహారంతోనే సాధించారని చెబుతున్నారు. సాధారణంగా కండలు పెంచుకోవాలంటే మాంసాహారం తీసుకోవాల్సిందే అనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ చరణ్ మాత్రం ఆ అభిప్రాయాన్ని పూర్తిగా తప్పు అని నిరూపించారు. ఇటీవల ఆయన చాలా సందర్భాల్లో అయ్యప్ప స్వామి మాల ధరించి కనిపించారు. అంటే ఆయన దీక్షలో ఉండి కూడా ఈ కఠినమైన ట్రైనింగ్ కొనసాగించారని అర్థమవుతోంది. ధీక్షలో ఉండే సమయంలో పూర్తిగా శాఖాహారం మాత్రమే తీసుకుంటారు. అయినప్పటికీ ఆయన అంతటి బలమైన శరీరాన్ని నిర్మించగలిగారు. ఆహారంలో ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, ప్రోటీన్ ఉన్న ప్రకృతి సిద్ధమైన పదార్థాలను తీసుకున్నారని సమాచారం. రసాయనాలతో పెంచిన పౌల్ట్రీ ఫుడ్ లేదా హార్మోన్‌లతో నిండిన మాంసాహారం కాకుండా సహజమైన ఆహారంతో కూడా ప్రపంచ స్థాయి ఫిట్‌నెస్ సాధించవచ్చని చరణ్ చూపించారు. ఇది యువతకు మంచి సందేశంగా మారుతోంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన నిరూపించారు. ఈ సినిమాలో చరణ్ చేసిన వ్యాయామంలో గద ఆయుధాన్ని కూడా ఎక్కువగా ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీనిని ‘ముగ్ధార్’ అని కూడా పిలుస్తారు. ఇది పాతకాలంలో యోధులు, పహిల్వాన్లు శిక్షణ కోసం ఉపయోగించే ఒక భారీ చెక్క ఆయుధం. దీన్ని తిప్పడం ద్వారా చేతుల బలం, భుజాల బలం, శరీర సమతుల్యత పెరుగుతుంది. గ్లింప్స్‌లో కూడా చరణ్ గదను తిప్పుతూ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు కనిపించడం అభిమానులను మరింత ఉత్సాహపరిచింది. కుస్తీ గ్రౌండ్ లో జరిగే కుస్తీ పోరాటాలు సినిమాలో ముఖ్యమైన భాగంగా ఉండబోతున్నాయని ఈ సన్నివేశాలు సూచిస్తున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తుండగా..వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *