నటసింహం నందమూరి బాలకృష్ణ యాక్షన్ చిత్రాల డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరేక్షన్ లో మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన వీర సింహా రెడ్డి ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సినిమా తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఇంకా స్టార్టింగ్ దశలోనే ఉన్నప్పటికీ, దీనికి సంబంధించిన ప్రతి చిన్న వార్త కూడా ఫిల్మ్ నగర్‌లో పెద్ద చర్చగా మారుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో యంగ్ హీరోయిన్ డింపుల్ హయాతికి కీలకమైన అవకాశం దక్కినట్టు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రధాన కథానాయికగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో కథానాయిక పాత్ర కోసం డింపుల్ హయాతిని ఎంపిక చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈమె పాత్ర సినిమా సెకండ్ హాఫ్‌లో కథకు పెద్ద మలుపు తిప్పే విధంగా ఉంటుందని చెబుతున్నారు. చిన్నదైనా, కథలో బలమైన ప్రాధాన్యం ఉన్న పాత్రగా ఆమె కనిపించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథ ముంబై నగరంలోని గ్యాంగ్ స్టర్ ప్రపంచాన్ని నేపథ్యంగా చేసుకుని సాగనుందని తెలుస్తోంది. బాలయ్య ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్. యాక్షన్ సన్నివేశాలు, మాస్ ఎలివేషన్లు, బలమైన డైలాగులతో ఈ పాత్ర ఒక రేంజ్ లో ప్రేక్షకులను అలరించనుందని అభిమానులు ఆశిస్తున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని తనదైన టేకింగ్ తో బాలయ్యను అభిమానులకు ప్రెజెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన సినిమాల్లో హీరో ఎలివేషన్ సన్నివేశాలు, బలమైన విలన్ పాత్రలు, భారీ యాక్షన్ ఎపిసోడ్లు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ పూర్తి స్థాయిలో ప్రారంభం కానుందని సమాచారం.