పేదలందరికీ ఇళ్లు  కల్పిస్తున్నామన్న ఆనందం పూర్తి సంతృప్తినిస్తోంది:ఏపీ సీఎం చంద్రబాబు 

Spread the love

పేదలందరి జీవితాల్లో వెలుగులు నింపటమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నాయుడుపేటలో లబ్దిదారులకు ఇంటి తాళాలు ఇచ్చి టిడ్కో ఇళ్లను నేడు ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు. ఈ కొత్త ఏడాదిలో ఉగాది పండుగ, రంజాన్ పండుగల తర్వాత 2.50 లక్షల ఇళ్లలో గృహప్రవేశాల పండుగ చేసుకుంటున్నాం. పేదలందరికీ ఇళ్లు  కల్పిస్తున్నామన్న ఆనందం పూర్తి సంతృప్తి ఇస్తోందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో రెండో మారు పేదలకు ఇళ్లను పంపిణీ చేస్తున్నామన్నారు. పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేయించిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. పేదలందరికీ పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్నదే టీడీపీ సంకల్పమని పేర్కొన్నారు. 2029 నాటికి రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. 2014-19లో 8.19 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టి పేదలకు అందించాం. గత ఏడాదిలో 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయించాం. ఇప్పుడు 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయించామని తెలిపారు. గత పాలకులు వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేశారని వాటన్నిటినీ గాడినపెడుతున్నామన్నారు.పేదలు ఉండే నివాస ప్రాంతాల్లో అంగన్ వాడీ, స్కూలు లాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలోనే పార్కులతో పాటు ఇంటర్నల్ రోడ్లు రూపొందించినట్లు పేర్కొన్నారు. గత పాలకులు పేదవాళ్ల పొట్టకొట్టారని మండిపడ్డారు. ఐదేళ్లలో 6.5 లక్షల ఇళ్లు మాత్రమే కట్టారని ఈ 21 నెలల్లోనే 5.5 లక్షల ఇళ్లను కట్టి పేదవాళ్లకు అప్పగించామన్నారు. ఇక  త్వరలో మరో 4.5 లక్షల ఇళ్లను కట్టించనున్నట్లు తెలిపారు. 4.73 లక్షల ఎన్టీఆర్ హౌసింగ్ ఇవ్వాలని భావిస్తే దానిని రద్దు చేశారు. రూ.923 కోట్ల పేదవాళ్ల డబ్బులు ఎగ్గొట్టారని మండిపడ్డారు. ప్రజావేదికతో ప్రారంభించిన విధ్వంసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. రూ.9.70 లక్షల కోట్ల అప్పులు చేశారని  కేంద్రం ఇచ్చిన డబ్బులు మళ్లించి అవినీతి అక్రమాలు, అధికార దుర్వినియోగం చేశారని ఆక్షేపించారు.  రూ.174 కోట్ల రూపాయల్ని టిడ్కో లబ్దిదారులు కట్టిన డబ్బును కూడా వాడేసుకున్నారన్నారు. 22 వేల మంది లబ్దిదారులకు ఆ డబ్బులను వెనక్కి ఇస్తున్నట్లు తెలిపారు. పేదవాళ్లు ఉండాల్సింది మురికివాడల్లో కాదని  పరిశుభ్రమైన చోట్ల నివాసం ఉండాలిన్నారు. 2029 నాటికి అందరికీ ఇళ్లు ఇవ్వాలంటే ఇంకా 17 లక్షల పైచిలుకు ఇళ్లు నిర్మించాల్సి ఉందని ఈ ఏడాది జూన్ నాటికి 2 లక్షల ఇళ్లు, సెప్టెంబరుకు 1.60 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయిస్తామన్నారు. రాష్ట్రంలో పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. దీపం 2.0 కింద మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తున్నాం. భవిష్యత్తులో పైప్డ్ గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీరు ఇవ్వాల్సి ఉన్నా గత పాలకులు దానిని నిర్వీర్యం చేశారని ఆక్షేపించారు. ఇప్పుడు కేంద్రాన్ని ఒప్పించి 2028 వరకూ ఈ పథకం కొనసాగించేలా చేసి ప్రతీ ఇంటికీ కుళాయి ద్వారా నీరందించనున్నట్లు తెలిపారు. ప్రతీ ఇంటికి సౌర పానెల్స్  పెట్టుకుంటే ఉచిత విద్యుత్ వస్తుంది. పంపుసెట్ కు కూడా బిగించుకుంటే విద్యుత్ అంతా ఉచితంగా వస్తుంది. వీటన్నింటినీ వినియోగించుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సంపద సృష్టి కోసమే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. సమర్ధవంతమైన నిర్వహణతో సంక్షేమం- అభివృద్ధిని సమపాళ్లుగా కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *