తమిళనాడు రాజకీయ హడావుడి మొదలైంది. వచ్చే ఎన్నికలకు ఇక నెల కూడా సమయం లేదు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ తమ మేనిఫెస్టోలతో ప్రజలను ఆకర్షించుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. ఇక అధికార డీఎంకే కూడా తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టో రూపంలో వరాల జల్లు కురిపించారు. మహిళలకు రెట్టింపు సాయం, విద్యార్థులకు ల్యాప్‌టాప్ లు, సామాన్యులకు గృహోపకరణాల కూపన్లు.. ఇలా ప్రతి వర్గాన్ని ఆకర్షించేలా స్టాలిన్ ప్లాన్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ.. ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. ‘ద్రవిడ మోడల్’ పాలనే మా ఊపిరి అంటూ.. మరోసారి అధికారంపై స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.
చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీఎం స్టాలిన్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ఓటర్లను ఆకర్షించేలా ఈ హామీల పత్రాన్ని రూపొందించారు. రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు.. ఇలా ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ హామీలు ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారతాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. తాము ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ద్రవిడ సిద్ధాంతం, సంక్షేమ కార్యక్రమాలే డీఎంకే తమ ప్రధాన అస్త్రంగా మలుచుకుంది. రాబోయే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ తమకే పట్టం కడతారనే పూర్తి నమ్మకం ఉందని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ మేనిఫెస్టోలో మహిళలు, విద్యార్థులు, రైతులు, వృద్ధులకు మంచి పథకాలను ప్రకటించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు అందిస్తున్న ప్రతిష్టాత్మక ఉచిత అల్పాహార పథకాన్ని ఎనిమిదో తరగతి వరకు పొడిగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీనివల్ల విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం తగ్గడంతో పాటు పాఠశాలల్లో హాజరు శాతం కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక మహిళలకు నెలకు అందిస్తున్న రూ.1,000 ఆర్థిక సాయాన్ని ఏకంగా రూ.2,000లకు పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయ రంగానికి దన్నుగా నిలుస్తూ రైతుల ఉత్పాదకతను పెంచేందుకు ఫ్రీగా పంప్ సెట్లను పంపిణీ చేయనున్నారు. యువత, విద్యా రంగానికి ఈ మేనిఫెస్టోలో ఎక్కువ భాగం కేటాయించారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్ లు అందిస్తామని సీఎం వివరించారు.
‘పుదుమై పెణ్’, ‘తమిళ్ పుదల్వన్’ పథకాల కింద విద్యార్థులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.1,500లకు పెంచుతున్నట్లు తెలిపారు. సామాజిక భద్రతలో భాగంగా వృద్ధాప్య పింఛను రూ.2,000లకు, దివ్యాంగుల పింఛను రూ.2,500లకు పెంచుతామని హామీ ఇచ్చారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలను ప్రత్యేకంగా గుర్తించి, వారికి సొంత ఇల్లు నిర్మించుకునేందుకు అవసరమైన ఆర్థిక, రుణ సదుపాయం కల్పిస్తామని రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను అరికట్టి, యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడంపై డీఎంకే దృష్టి సారించింది. ముఖ్యంగా ఐటీ, సేవా రంగాల్లో వేలాది ఉద్యోగాలు సృష్టించేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ‘నియో టైడల్ ఐటీ పార్కుల’ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. సామాన్యుల గృహ అవసరాలను తీర్చేందుకు ఒక వినూత్న పథకాన్ని సైతం మేనిఫెస్టోలో చేర్చారు. ఇక ప్రతి కుటుంబానికి రూ.8,000 విలువైన ప్రత్యేక కూపన్ అందిస్తామని, దీని ద్వారా వాషింగ్ మెషీన్, మిక్సీ, రిఫ్రిజిరేటర్ లేదా మైక్రోవేవ్ ఓవెన్ లాంటి గృహోపకరణాలను ఉచితంగా లేదా సబ్సిడీతో కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధి అనే ద్రవిడ సిద్ధాంతాల పునాదిగా రూపొందించిన ఈ మేనిఫెస్టో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు రాజకీయల్లో ఏమేరకు ఓటర్లను ఆకట్టుకుంటుందో చూడాలి.