మిడిల్ ఈస్ట్ సెగకు అల్లాడుతున్న పాక్..! 

Spread the love

మిడిల్ ఈస్ట్  యుద్ధ జ్వాలల సెగ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు తగులుతోంది. అక్కడ పేలుతున్న మిస్సైల్స్ పలు దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కూలడానికి కారణమవుతోంది. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాల పరిస్థితి దుర్బలంగా మారింది. ఇప్పటికే ఆర్థిక ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్, ఈ యుద్ధ పరిణామాలతో మరింత ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు, ఖాళీ అవుతున్న చమురు నిల్వలు ఆ దేశాన్ని పూర్తి స్థాయి లాక్‌డౌన్ అంచునకు తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ కఠిన నిర్ణయాలు ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పటికే తీవ్ర ద్రవ్యోల్బణంతో, ఆర్థిక లోటుతో అల్లాడుతున్న పాకిస్తాన్ వంటి దేశాలకు ఇది పెద్ద దెబ్బే. పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి అత్యంత దయాణంగా తయారైంది. అంతర్జాతీయంగా పెరిగిన ధరల భారాన్ని ప్రభుత్వం ప్రజలపై మోపక తప్పలేదు. దీంతో పాకిస్తాన్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.55, డీజిల్ ధర రూ.55 మేర పెరిగాయి. వాహనదారులకు ఇది భారమే. ఇక సామాన్య గృహిణులకు ఎల్‌పీజీ సిలిండర్ ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్ ధర ఏకంగా 35 శాతం పెరిగి రూ.5,135కు చేరిందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ధరల పెరుగుదలకు తోడు  చమురు లభ్యత మరో పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద కేవలం 11 రోజులకు సరిపడా చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ కొరతకు ప్రధాన కారణం సప్లై చైన్ దెబ్బతినడమే. స్ట్రాటజిక్ గా కీలకమైన హార్ముజ్ జలసంధి నుండి చమురు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. వీటితో పాటు  ఇరాన్ జరిపిన దాడుల కారణంగా గల్ఫ్ దేశాల్లోని కీలకమైన ఆయిల్ రిఫైనరీలు ధ్వంసమయ్యాయి. దీంతో చమురు ప్రొడక్షన్ పై ఆ ప్రభావం పడింది. మరోవైపు, ఈద్ మరియు నౌరోజ్ సెలవుల కారణంగా ఇరాన్ నుంచి పాకిస్తాన్‌కు అందుతున్న గ్యాస్ సరఫరా కూడా గణనీయంగా తగ్గింది. ఫ్యూయల్ ఇంకా  గ్యాస్ రెండూ ఒకేసారి కొరతగా మారడంతో పాకిస్తాన్ తీవ్ర ఇంధన సంక్షోభంలో పడిపోయింది. చమురు కొరతతో రవాణా వ్యవస్థ స్తబ్దతగా మారింది. పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రభుత్వం, విద్యుత్ మరియు ఇంధనాన్ని ఆదా చేసేందుకు కఠినమైన చర్యలకు ఉపక్రమించింది.  విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ఉద్యోగుల పనిదినాలను తగ్గించింది. వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని అమలు చేస్తోంది. దేశం ఇప్పుడు పూర్తి స్థాయి లాక్‌డౌన్ అంచున నిలిచిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని గట్టెక్కించేందుకు వేరే దారిలేదని ప్రధాని షెహబాజ్ షరీఫ్ భావించారు. ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇంధన సంక్షోభం తీవ్రతను దేశ ప్రజలకు వివరించారు. అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలను తక్షణమే మూసివేశారు. విద్యార్థులకు చదువు నష్టపోకుండా ఆన్‌లైన్ క్లాస్ లు పెట్టాలని ఆదేశించారు. ఇక  ప్రభుత్వ , ప్రైవేట్ రంగ ఉద్యోగులలో 50 శాతం మందిని ఇంటి నుండి  పని చేయాలని ఆదేశించారు. తీవ్ర ఇంధన కొరత ఉన్న పంజాబ్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో వారానికి పని దినాలను 5 నుండి 4 రోజులకు తగ్గించారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు మంత్రుల జీతాల్లో 20 శాతం కట్ చేశారు. రవాణా నియంత్రణకి వస్తే   ప్రైవేట్ వాహనాల వినియోగంపై కఠినమైన రూల్స్ విధించారు. అలాగే, ప్రభుత్వ వాహనాల కదలికలను కూడా గణనీయంగా తగ్గించారు.ఇంధన సంక్షోభం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలికంగా కోలుకోలేని దెబ్బ తీయనుంది. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం, ఈ చమురు సంక్షోభం కారణంగా పాకిస్తాన్ జీడీపీ (GDP) 2 నుంచి 3 శాతం మేర పడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే చుక్కలు చూపిస్తున్న ద్రవ్యోల్బణం మరింత పెరిగి, 40 నుంచి 45 శాతానికి చేరుకోవచ్చని హెచ్చరిస్తున్నారు.  ఒకవైపు దేశీయంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే, మరోవైపు సమస్య మూలాలను పరిష్కరించేందుకు పాకిస్తాన్ దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం ఆపడం ద్వారానే తమ దేశానికి విముక్తి లభిస్తుందని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం విశ్వసిస్తోంది. అక్కడ శాంతి పునరుద్దరణకు అవసరమైతే ఇరు పక్షాల మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి కూడా పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ప్రకటించింది. అదే సమయంలో, తక్షణ ఆర్థిక అవసరాల కోసం పాకిస్తాన్ తన మిత్ర దేశాలైన చైనా , సౌదీ అరేబియా నుంచి ఆర్థిక సహాయం కోరుతోంది. అలాగే, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్  (IMF)తో కూడా అత్యవసర చర్చలు జరుపుతోంది.పాకిస్తాన్ ప్రస్తుతం చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఉన్న ఆర్థిక సమస్యలకు ఈ పశ్చిమాసియా  యుద్ధం తోడవడంతో పరిస్థితి అదుపుతప్పింది. ప్రభుత్వం తీసుకుంటున్న లాక్‌డౌన్ వంటి కఠిన చర్యలు, పొదుపు చర్యలు తాత్కాలికంగా మాత్రమే  ఉపశమనాన్ని ఇస్తాయి.  పశ్చిమాసియాలో యుద్ధం త్వరగా ముగిసి పరిస్థితులు అదుపులోకి రాకపోతే పాకిస్తాన్ ఉనికికే అది ప్రమాదంగా మారే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *