ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వరుసగా రెండో ఏడాది దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ జాతీయ పురస్కారాలకు ఎంపికైంది. దీనిపై ఆ శాఖను నిర్వహిస్తున్న మంత్రి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ పురస్కారాలకు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డులు మా బాధ్యతను పెంచాయన్న పవన్ కూటమి ప్రభుత్వం గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. మహిళలకు స్నేహపూర్వక వాతావరణంగల పంచాయతీగా తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండల పరిధిలోని బొక్కసం పాలెం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం గెలుచుకోవడం మరింత సంతృప్తినిచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుపరిపాలనలో విశాఖపట్నం జిల్లా, శృంగవరం గ్రామ పంచాయతీ మొదటి స్థానంలో నిలిచింది. గ్రామ స్థాయిలో పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి అంశాల్లో వైఎస్ఆర్ కడప జిల్లా, చెమ్ముళ్లపల్లి గ్రామం జాతీయ స్థాయిలో రెండో స్థానం దక్కించుకుంది. మౌలికసదుపాయల కల్పనలో స్వయం సమృద్ధి సాధించిన పంచాయతీల్లో ప్రకాశం జిల్లా, గుండమల గ్రామ పంచాయతీ మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకర్గం పరిధిలోని కుప్పం మండలం జాతీయ స్థాయిలో 3వ అత్యుత్తమ మండలంగా ఎంపికయ్యిందన్నారు. గత ఏడాది కూడా వివిధ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ 4 అవార్డులు గెలుచుకోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. . అత్యుత్తమ పని తీరుతో జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకోవడానికి కృషి చేసిన ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. గ్రామీణాభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించిన గౌరవ ప్రధాని మోడీ, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ కు ధన్యవాదాలు తెలిపారు.