పశ్చిమాసియాలో రగులుతున్న పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి చుట్టూ పెద్ద డ్రామా నడుస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న ఈ కీలక జలమార్గంపై ఇరాన్ తన పట్టును మరింత బిగిస్తోంది. ఇప్పటికే ఆ మార్గాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్న ఇరాన్, ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ నుండి వెళ్లే భారీ షిప్ లపై భారీగా టోల్ వసూలు చేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు తెరతీసింది. ఈ టోల్ వసూలు కేవలం ప్రతిపాదన కాదని ఇప్పటికే అమలులోకి వచ్చేసిందని ఇరాన్ అధికారిక IRBI తెలిపింది.. హర్మూజ్ మార్గంలో వెళ్లే ఒక్కో ఆయిల్ షిప్ నుండి గరిష్టంగా రూ. 18.90 కోట్లు వసూలు చేయాలని ఇరాన్ నిర్ణయించింది. ఇది సాధారణ నౌకాయాన ఖర్చులతో పోలిస్తే భారీగా ఉండడం గమనార్హం. జలమార్గాన్ని పర్యవేక్షించడం,సెక్యూరిటీని పటిష్టం చేయడం మరియు ఆర్థిక నిబంధనలను క్రమబద్ధీకరించడమే తమ లక్ష్యమని ఇరాన్ చెప్పుకుంటోంది. ఇప్పటికే ఈ కొత్త రూల్స్ ను పాటించి 26 నౌకలు హర్మూజ్ జలసంధిని దాటినట్లు IRBI స్పష్టం చేసింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే ఈ మార్గంలో అందరికీ అనుమతి లేదు. ఇరాన్ పోరాడుతున్న అమెరికా మరియు ఇజ్రాయెల్‌కు చెందిన నౌకల రాకపోకలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. అంటే, ఈ రెండు దేశాల షిప్ లు టోల్ కడతామన్నా సరే, ఆ మార్గంలో ప్రవేశించే అవకాశం లేదని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇరాన్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయంపై అగ్రరాజ్యం అమెరికా మరింత రగులుతోంది. అంతర్జాతీయ జలమార్గాలను ఇలా ఆక్రమించి, వాటిని తమ సొంత ఆస్తిగా చెప్పుకోవడం ఏంటని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తీవ్రంగా మండిపడ్డారు. ఇంటర్నేషనల్ వాటర్స్ పై ఇరాన్ పెత్తనాన్ని ప్రపంచ దేశాలు అంగీకరించబోవని పేర్కొన్నారు. అటు G7 దేశాలు కూడా ఇరాన్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. నౌకల స్వేచ్ఛా ప్రయాణాన్ని వెంటనే పునరుద్ధరించాలని, ఇంటర్నేషనల్ రూల్స్ ను గౌరవించాలని సూచిస్తున్నాయి. అంతర్జాతీయంగా పరిస్థితి మరింత దిగజారకముందే దీనికి ప్రపంచ దేశాలు ఏ పరిష్కారాన్ని ఆలోచిస్తాయో అన్నది వేచి చూడాలి.