పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఆ ప్రాంతం కీలకమైన చమురు ఉత్పత్తి, సరఫరాకు కీలకం కావడంతో ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ పై దాని ప్రభావం పడుతోంది. ఇప్పటికే భారత్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాపై అప్రకటిత ఆంక్షలు కొనసాగుతున్నాయి. గత నెలలో ధరలు పెరిగినప్పటికీ, స్టాక్ దొరకక హోటళ్లు, రెస్టారెంట్ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభం ఇప్పుడు దేశీయ ఇంధన ధరలపై నేరుగా దాడి చేస్తోంది. వ్యాపారులపై ధరల పిడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వాణిజ్య రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఒక్కసారిగా రూ. 195.50 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్లు , చిన్న వ్యాపారాల నిర్వహణ వ్యయం భారంగా మారనుంది. ఇప్పటికే మార్కెట్లో పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్న వ్యాపారులకు ఇది మరింత భారమనే చెప్పాలి. సరిగ్గా నెల రోజుల క్రితం, అంటే యుద్ధం మొదలైన మరుసటి రోజు మార్చి 1న, చమురు కంపెనీలు రూ. 114.50 పెంచాయి. ఆ భారం నుండి కోలుకోక ముందే అంటే కేవలం 30 రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర భారీగా పెరగడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఉద్రిక్తతలు, చమురు సరఫరాలో ఇబ్బందులతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెరుగుదలతో దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,000 మార్కును దాటేసింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2,078.50 కి చేరింది.
యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలు ఈ భారాన్ని వినియోగదారులపైకి మళ్లించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 2,000 రూపాయల మార్కును వాణిజ్య సిలిండర్ దాటడం ఒక చారిత్రక రికార్డుగా మారుతోంది. అయితే ఇళ్లలో వాడుకునే గ్యాస్ సిలిండర్లకు కేంద్రం ఊరటనిచ్చింది. 14.2 కేజీలడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. గత కొంతకాలంగా వాణిజ్య సిలిండర్ల ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నప్పటికీ, సామాన్యుడి వంటింటి బడ్జెట్ను ఎఫెక్ట్ చేసే గృహ సిలిండర్ ధరను మాత్రం అలాగే ఉంచింది. 14.2 కేజీల సిలిండర్ ధరలో మార్పు లేదు. చివరిసారిగా మార్చి 7న రూ. 60 పెరిగింది. మార్చి 7 నుండి నేటి వరకు ధరలు అలాగే ఉన్నాయి.
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఈ భారం నేరుగా భారత్ లోని మధ్యతరగతి ప్రజలపై పడకుండా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ధరలను స్థిరంగా ఉంచడం ద్వారా ద్రవ్యోల్బణ ప్రభావం సామాన్యుడి మీద పడకుండా కవచంలా నిలుస్తోంది. అంతర్జాతీయంగా ధరల ఒత్తిడి ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆ భారాన్ని తానే భరిస్తూ ప్రజలపై పడకుండా చూస్తోంది. కేంద్రం యొక్క ఈ చర్య సామాన్య, మధ్యతరగతి వర్గాలకు మేలు చేసేదిగా ఉంది. ప్రస్తుతం ప్రపంచం యుద్ధ పరిస్థితుల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఒకవైపు, ఇజ్రాయెల్-హమాస్ ఉద్రిక్తతలు మరోవైపు ఇంటర్నేషనల్ ఫ్యూయల్ సప్లై చైన్ ను దెబ్బతీస్తున్నాయి. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఒక్క డాలర్ పెరిగినా, భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో లీటర్ ధర పెరిగిపోవాలి. కానీ, గత కొన్నాళ్లుగా దేశీయ మార్కెట్ లో స్థిరత్వం కనిపిస్తోంది.
సరిగ్గా ఏడాది క్రితం మార్చిలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ , డీజిల్ ధరలపై లీటరుకు రూ. 2 చొప్పున తగ్గింపు ప్రకటించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు చెక్కుచెదరకుండా కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలలో హెచ్చుతగ్గులకు అతీతంగా గడిచిన ఏడాది కాలంగా ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. రవాణా రంగంపై ఆధారపడే నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఈ స్థిరత్వం వల్ల కంట్రోల్ లో ఉంటున్నాయి. ధరల పెరుగుదలలో స్థిరత్వం వలన వాహనదారులకు మాత్రమే కాకుండా మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ చర్య బిగ్ సపోర్ట్ గా చెప్పుకోవచ్చు. డీజిల్ ధరలు పెరగకపోవడం వల్ల రవాణా ఖర్చులు పెరగవు. ఫలితంగా కూరగాయలు, పప్పు ధాన్యాలు మరియు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలో ఉంటాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రానున్న రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా మారతాయో తెలీదు అయితే ప్రస్తుతానికి మాత్రం సామాన్యుడిపై ఈ భారం పడకుండా ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తోంది.