బకాయిలు పెట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా చంపాలని చూసే కుట్ర:వై.ఎస్.షర్మిల

Spread the love

కూటమి ప్రభుత్వ రెండేళ్లలో రెండు సార్లు ఆరోగ్యశ్రీ సేవలు నిలవడం నిజంగా సిగ్గుచేటని ఏపీసీసీ ఛీఫ్ షర్మిల విమర్శించారు.  నెలల తరబడి వైద్యసేవలు ఆపడం చంద్రబాబు పాలన వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.  ఆరోగ్యశ్రీ కి  రూపాయి లేదు.. కూటమి ప్రభుత్వ దుబారాకు అంతు లేదని చురకలంటించారు. పేదోడి సంజీవనికి నిధులు నిల్. అమరావతి లక్ష కోట్ల అప్పులకు లోటు లేదని విమర్శించారు.  ఆరోగ్యానికి ఇవ్వడానికి చిల్లిగవ్వ లేదు. యోగాంధ్ర అని, GST ఉత్సవ సభలని, ఏడాదిలో ప్రధాని విలాసాల కోసమే 12 వందల కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు గారికి, ఆరోగ్యశ్రీ బకాయిలు 3 వేల కోట్లు ఇవ్వడానికి మనసు లేదని దుయ్యబట్టారు. ఇదేనా కూటమి ప్రభుత్వ మెరుగైన ప్రజారోగ్యం ? ఇలాగేనా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ? వైద్యం అందక ప్రజలను పాడె ఎక్కించడమా స్వర్ణాంధ్ర 2047 విజన్ ? అంటూ ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నలు సంధించారు. ఆరోగ్యశ్రీ పథకం దివంగత కాంగ్రెస్ సీఎం  YSR మానస పుత్రికని  కోట్ల మంది ప్రజలకు ప్రాణాలను నిలిపిన ప్రాణదాతని పేర్కొన్నారు. సంజీవని లాంటి పథకాన్ని నేడు భ్రష్టు పట్టించారని విమర్శించారు.  బకాయిలు ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ ఉసురు తీస్తున్నారు. బకాయిలు పెట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా చంపాలని చూసే కుట్రని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ ని అనారోగ్యశ్రీ గా మార్చే ప్రయత్నం. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ముసుగులో పథకాన్ని ప్రైవేటుపరం చేసే ఎత్తుగడని ఆక్షేపించారు.  ప్రజారోగ్యంపై దోబుచులాడటం పక్కన పెట్టి వెంటనే 3 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. NTR వైద్య సేవకోసం బడ్జెట్ లో 4 వేల కోట్లు పెట్టిన ప్రభుత్వం.. నిధులు విడుదలకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు.  తక్షణం హాస్పిటల్స్ యాజమాన్యాలను చర్చలకు పిలవాలని వెంటనే వైద్యసేవలను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు.  లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని షర్మిల అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *