ఐపీఎల్ సీజన్ 19లో అన్ని మ్యాచ్ లు ఒక్కో మ్యాచ్ ను ఆడేశాయి. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ తో అన్ని జట్లు ఒక్కో మ్యాచ్ ఆడేసినట్లైంది. ఇక లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. అబ్దుల్ సమద్ 36 (25; 3×4, 1×6), మిచెల్ మార్ష్ 35 (28; 2×4, 3×6) మినహా ఎవరూ పెద్దగా పరుగులు చేయలేకపోయారు. మార్క్రమ్ (11), పూరన్ (8), బదోని (0) నిరాశ పరిచారు. ఢిల్లీ బౌలర్లలో నటరాజన్ 3 వికెట్లు, లుంగీ ఎంగిడి 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 17.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసి లక్ష్యాన్ని పూర్తి చేసింది. సమీర్ రిజ్వీ 70 నాటౌట్ (47; 5×4, 4×6), ట్రిస్టాన్ స్టబ్స్ 39 నాటౌట్ (32; 3×4, 1×6) పరుగులతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు, షమీ మొహసిన్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక ఇప్పటివరకు పాయింట్ల టేబుల్ ను ఒకసారి గమనిస్తే రాజస్థాన్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పంజాబ్ జట్లు గెలుపులు నమోదు చేసి పాయింట్ల ఖాతా తెరిచాయి. హైదరాబాద్, లక్నో, గుజరాత్, కే.కే.ఆర్, చెన్నై జట్లు పాయింట్ల ఖాతా తెరవలేదు.