కొత్త ఆర్థిక సంవత్సరాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయంగా యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్న సంకేతాలు, ముడి చమురు ధరలు తగ్గడం మరియు అమెరికా మార్కెట్ల సానుకూల అంశాలతో దేశీయ సూచీలు దూసుకెళ్లాయి. నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 1186 పాయింట్లు లాభపడి 73,134 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 348 పాయింట్ల లాభంతో 22,679వద్ద ముగిసింది. ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని, యుద్ధం ఆగే అవకాశం ఉందన్న వార్తలు మార్కెట్లకు కలిసొచ్చింది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు 104 డాలర్ల వద్దకు తగ్గడం కూడా కీలకంగా మారింది. గత కొన్నాళ్లుగా ఒత్తిడిలో ఉన్న బ్యాంకింగ్ షేర్లలో నేడు భారీ కొనుగోళ్లు కనిపించాయి. ఏప్రిల్ మొదటి రోజు కావడంతో ఇన్వెస్టర్లు కొత్తగా పెట్టుబడులు పెట్టడం కూడా మార్కెట్ పెరగడానికి ఒక కారణం. ఈరోజు ట్రేడింగ్ లో ట్రెంట్, ఇండిగో, బీ.ఈ.ఎల్, అదానీ పోర్ట్స్, ఎస్.బీ.ఐ షేర్లు లాభాల్లో కొనసాగాయి.