స్టార్ బ్రాండ్ కు  సరికొత్త అర్దానిస్తోన్న ‘మెగా సిస్టర్స్’

Spread the love

ఏ రంగంలోనైనా వారసత్వం అనేది ఒక గొప్ప అవకాశమే అయినా, దాని వెనుక ఉండే బాధ్యత మరియు ఒత్తిడి అంతకంటే ఎక్కువగా ఉంటాయి. దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీని మకుటంలేని మహారాజులా ఏలుతున్న  కుటుంబం నుండి వచ్చి, ఫ్యామిలీ లెగసీతో  మాత్రమే కాకుండా తమదైన శైలిలో తాను ఎంచుకున్న రంగంలో రాణించడం సవాలుతో కూడుకున్న పని. ఆ పనిని తమదైన అంకితభావంతో కొనసాగిస్తున్నారు ఈ మెగా సిస్టర్స్. 

కేవలం వెండితెరపై కనిపించి మెప్పిస్తేనే అది విజయమనుకుంటే పొరపాటే  తెర వెనుక ఉండి సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహించడం అనేది ఒక వ్యక్తికి సినిమాపై ఉన్న డెడికేషన్ ను చాటి చెబుతుంది. తండ్రి ఒక స్టార్ హీరో ఇమేజ్ ఉన్నప్పటికీ, ఒక నిర్మాతగా అభిరుచిని చాటుకుంటూ ప్రేక్షకులను అలరించడం నిర్మాణ విలువలను నిలబెట్టుకుంటూ వినోదాన్ని అందించడం అంత తేలికేం కాదు. నిర్మాతగా రాణించడం  అంటే కేవలం డబ్బు పెట్టుబడి పెట్టడం మాత్రమే కాదు. కథల  ఎంపిక నుండి విడుదల వరకు ప్రతి అడుగులోనూ భాగస్వామ్యం కావడం. మెగా అనే పెద్ద లెగసీని భుజాన వేసుకుని ప్రేక్షకుల అంచనాలను అందులోనూ మెగా అభిమానుల అంచనాలను  దృష్టిలో ఉంచుకుంటూనే కాలంతో పాటు మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టు సినిమాలు నిర్మించడం అభినందనీయం. ఒక నాణ్యమైన సినిమాను ప్రేక్షకులకు అందించాలనే తపనతో తెర వెనుక ఉండి పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతున్న ‘మెగా సిస్టర్స్’  ఆ కుటుంబ వారసత్వానికి స్టార్ బ్రాండ్ కు సరికొత్త అర్థాన్ని ఇస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల తన తండ్రి లెగసీని కొనసాగిస్తూ అటు కాస్ట్యూమ్ డిజైనర్‌గా, ఇటు నిర్మాతగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల తర్వాత ‘ఖైదీ నంబర్ 150’తో రీ-ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి, ఆయన ప్రతి సినిమాలోనూ సుస్మితా కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా తన తండ్రిని సరికొత్త స్టైలిష్ లుక్స్‌లో చూపించడంలో ఆమె సక్సెస్ అయ్యారు. సైరా నరసింహా రెడ్డి, ఆచార్య,  గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య అలాగే రాబోయే  సోషియో ఫాంటసీ ‘విశ్వంభర’ చిత్రానికి కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా  చేస్తున్నారు. అలాగే ఇక నిర్మాతగా కూడా ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’అనే నిర్మాణ సంస్థను స్థాపించి, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను నిర్మిస్తున్నారు. ఓటీటీలలో వెబ్ సిరీస్‌ లు, సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. శ్రీదేవి శోభన్ బాబు (2023) నిర్మాతగా ఆమె మొదటి చిత్రం. ఇక ఈ సంవత్సరం మన మెగాస్టార్ తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో 300కోట్లకు పైగా కలెక్షన్లతో బాస్ కు బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీ ఇచ్చారు. చిరంజీవి గారి కుమార్తెగా గుర్తింపు ఉన్నప్పటికీ, తెర వెనుక ఒక టెక్నీషియన్‌గా మరియు మేకర్‌గా కష్టపడుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్మితా కొణిదెల ఏర్పరుచుకున్నారు.

ఇక అదే కుటుంబం నుండి మెగా స్టార్ చిరంజీవి ఆశీస్సులతో, నాగబాబు గారాల తనయగా  వెండితెరపై అడుగుపెట్టారు మెగా సిస్టర్  నిహారిక, తనదైన డైనమిజంతో బలంగా, విమర్శలను సైతం చిరునవ్వుతో ఎదుర్కొని ఇండస్ట్రీలో ముందుకు సాగుతున్నారు. ‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్ సిరీస్‌తో ఒక ‘పక్కింటి అమ్మాయి’గా కనిపించే లుక్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘ఒక మనసు’ చిత్రంతో వెండితెరకు పరిచయమై, తన సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. నటనకు ప్రాధాన్యత ఇస్తూ, భావోద్వేగాలను పండించడంలో తనకంటూ ఒక సపరేట్ రూట్‌ను క్రియేట్ చేసుకుంది.  ‘పింక్ ఎలిఫెంట్’ నిర్మాణ సంస్థ  ఒక సాహసోపేతమైన ముందడుగు

కేవలం కెమెరా ముందు నిలబడి డైలాగులు చెప్పడమే కాదు, కెమెరా వెనుక ఉండి కథలను నడిపించడంలో కూడా నిహారిక సిద్ధహస్తురాలు. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి, యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ తనదైన విలక్షణతను చాటుకుంది. ఒక వైపు నటిగా రాణిస్తూనే, మరోవైపు నిర్మాతగా కొత్త తరహా కంటెంట్‌ను అందిస్తూ తెలుగు సినిమా రంగంలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. 

జీవితంలో ఎదురైన ఒడిదొడుకులను, వ్యక్తిగత సవాళ్లను నిహారిక ఎదుర్కొన్న తీరు నిజంగా ఈరోజు ప్రతి అమ్మాయికి స్ఫూర్తిదాయకం. జయాపజయాలను ఒకేలా తీసుకుంటూ తన కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇక సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీని నవ్వుతూ పక్కకు తోస్తూ తన పని తాను చేసుకుంటూ పోయే ఈ తరం వ్యక్తిత్వం నిహారిక సొంతం. సినిమా నిర్మాణంలో ఆమె అభిరుచి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మనందరినీ చిన్ననాటి జ్ఞాపకాలకు దగ్గరకు తీసుకెళ్లిన సినిమా ‘కమిటీ కుర్రాళ్లు’. కొత్త నటీనటులను, డైరెక్టర్ ను పరిచయం చేస్తూ ఆమె చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ పరంగానే కాకుండా ఆ సినిమా అటు పురస్కారాలను గెలుచుకుంది. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ వారిని ఉన్నతస్థాయికి తీసుకెళ్లే దిశగా తాను అండగా నిలవడం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్లకు సరైన ఉదాహరణగా నిలుస్తున్నారు.  హోస్ట్ గా, నటిగా, నిర్మాతగా.. ఇలా ఏ పాత్ర పోషించినా అందులో తనదైన ముద్ర వేయడం నిహారిక ప్రత్యేకత. ఇలా ఈ ఇద్దరు మెగా డాటర్స్ తమ ఫ్యామిలీ బ్రాండ్ కు మరింత అట్రాక్షన్ ను యాడ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *