పొరుగు దేశం పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కడ ఇంధన కొరత కూడా తీవ్రంగా ఉంది. పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ రూ. 384కి చేరింది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించడానికి పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఏ దేశానికైనా సరే ఇంధనం రావాలంటే గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకోవాలి. ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు ఇరాన్, హమాస్, హిజ్బుల్లా లాంటి ఉగ్రవాద సంస్థల మధ్య ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. దీనికి తోడు ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కూడా తారాస్థాయికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 శాతానికి పైగా ముడిచమురు సరఫరా అయ్యే అతి ముఖ్యమైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో తీవ్రమైన భద్రతా సమస్యలు తలెత్తాయి. అలాగే సౌదీ అరేబియాలోని ఈస్ట్-వెస్ట్ ఆయిల్ పైప్ లైన్ పై దాడులు జరగడంతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్ ఒక్కసారిగా కుదుపునకు గురైంది.
ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆయిల్ సరఫరా దెబ్బతినడంతో, డాలర్ నిల్వలు ఏమాత్రం లేని పాకిస్థాన్ కు ముడిచమురు కొనుగోలు చేయడం తలకు మించిన భారం అయిపోయింది. వాళ్ల దేశంలో ఉన్న ఆయిల్ నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఒకవేళ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కనుక మరింత ముదిరితే, పాకిస్థాన్ లో వాహనాలు తిరగడం పూర్తిగా ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఈ భయంతోనే పాక్ ప్రభుత్వం అలెర్ట్ అయింది. అంతర్జాతీయంగా సరఫరా తగ్గడం, దేశంలో కరెన్సీ విలువ పడిపోవడంతో.. పాకిస్థాన్ ప్రభుత్వం ప్రజలపై విపరీతమైన భారాన్ని మోపుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ ఇంధన ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. పాకిస్థాన్ లో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో రూ.384కి చేరింది. ఇక డీజిల్ ధర అయితే ఏకంగా రూ.415 కు పెరిగిపోయింది. కిరోసిన్ ధర కూడా ఏమాత్రం తీసిపోకుండా లీటర్ రూ.433 రూపాయలుగా ఉంది.
సామాన్యుడిని ఈ ధరలు వణికిస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం కంట్రోల్ తప్పిపోయాయి. ఈ ఇంధన భారాన్ని ఎలాగైనా తగ్గించుకోవాలని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యవసరంగా ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే స్మార్ట్ లాక్డౌన్ ప్రపోజల్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ , ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగులు రోజూ కార్లు, బైకుల్లో ఆఫీసులకు వెళ్లడం వల్ల లక్షల లీటర్ల పెట్రోల్ ఖర్చవుతోంది. దీన్ని అడ్డుకోవడానికి వారానికి కేవలం 4 రోజులే పనిదినాలు తీసుకురావాలని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. అంటే సోమవారం నుండి గురువారం వరకే ఆఫీసులు ఉంటాయి. శుక్రవారం, శనివారం ,ఆదివారం పూర్తిగా సెలవులు ఇచ్చేస్తారు. ఆ మూడు రోజులు ఎవరూ బండ్లు తీసుకుని ఆఫీసుల కోసం బయటకు రాకూడదు. వీటితో పాటు మరికొన్ని కఠిన నిబంధనలను కూడా పరిశీలిస్తున్నారు. ఆఫీసుల్లో 50 శాతం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం, రొటేషన్ పద్ధతిలో ఆఫీసులకు రప్పించడం. మంత్రులు, ప్రభుత్వ అధికారులకు వాడే కాన్వాయ్ లు, అధికారిక వాహనాల్లో కనీసం 50 శాతం వాహనాలను రోడ్ల మీదకు రాకుండా పక్కన పెట్టేయడం.
ఉన్నతాధికారులకు ఇచ్చే ఫ్రీ పెట్రోల్ అలవెన్సులకు భారీగా కోత విధించడం. వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. స్మార్ట్ లాక్డౌన్ అంటే కేవలం ఆఫీసులకు సెలవులు ఇవ్వడమే కాదు.. వ్యాపార సముదాయాలపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పాకిస్థాన్ లో ఒకవైపు ఇంధన కొరత, మరోవైపు తీవ్రమైన విద్యుత్ కోతలు ఉన్నాయి. రాత్రి పూట విద్యుత్ వినియోగాన్ని, ఆ సమయంలో జనాల సంచారాన్ని తగ్గించడానికి.. దేశవ్యాప్తంగా ఉన్న షాపింగ్ మాళ్లు, వాణిజ్య సముదాయాలు, మార్కెట్లను రాత్రి 8 గంటలకే ముందస్తుగా మూసివేసేలా నిబంధనలు తీసుకురావాలని భావిస్తున్నారు. కొన్ని ప్రతిపాదనల్లో అయితే, వారంలో మూడు రోజుల పాటు మార్కెట్లను పూర్తిగా బంద్ చేయాలనే ఆలోచన కూడా ఉంది. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న ఈ లాక్డౌన్ లాంటి చర్యలపై పాకిస్థాన్ ప్రజలు, ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. పెట్రోల్ సంక్షోభం వల్ల ప్రస్తుతం పాకిస్థాన్ లో నెలకొన్న దారుణమైన లాక్డౌన్ పరిస్థితులు. ఒక దేశం సొంతంగా ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం లేకపోయినా, కనీసం విదేశీ మారకద్రవ్యం మెయింటైన్ చేయకపోయినా ఎలాంటి దుస్థితి వస్తుందో చెప్పడానికి పాకిస్థాన్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. మొన్నటి వరకు శ్రీలంకను చూశాం, మొన్న బంగ్లాదేశ్ పరిస్థితి చూశాం, ఇప్పుడు పాకిస్థాన్ పరిస్థితి ఏకంగా లాక్డౌన్ వరకూ వచ్చింది. తీవ్రవాదానికి నిధులు ఇస్తూ, పొరుగు దేశాలపై కుట్రలు చేసే పాకిస్థాన్ కు.. ఇప్పుడు సొంత దేశంలో బండ్లు నడుపుకోవడానికి పెట్రోల్ కూడా లేని పరిస్థితి నెలకొంది.