అమరావతి చట్టబద్ధత బిల్లుకు తాజాగా రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. రాజ్యసభలో బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చిందని పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించి ఈ చారిత్రాత్మక విజయాన్ని జరుపుదాం. మన రాజధాని… మన గౌరవం అంటూ లోకేష్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఇక ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు ఈ బిల్లుకు మద్దతిచ్చి సహకరించిన పార్టీలకు కృతఙ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ఇదొక భావోద్వేగ రోజూ అని పేర్కొన్నారు.