తెలంగాణ గ్రూప్ -1 ఉద్యోగ నియామకాల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది ఉద్యోగ నియామకాల పట్ల తమ ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపు గా భావిస్తున్నాని పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసి, కన్నవారి కష్టం పై ఆధారపడలేక, కొలువు వస్తుందో రాదో అన్న దిగులుతో పదేళ్లు కాలం వెళ్లదీసిన గ్రూప్ -1 ఆశావహులకు ఇది పెద్ద ఊరటని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరావడంతోనే నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలో నియామక పత్రాలు అందజేసి, ఈ నియామకాలను అడ్డుకోవాలనుకున్న కుట్రలను కుతంత్రాలను ఛేదించి, రాష్ట్ర పునర్ నిర్మాణంలో తొలి గ్రూప్ -1 అధికారులుగా యువతను భాగస్వాములను చేశామన్నారు. ఈ సందర్భంగా వారికి మరో సారి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ఆలోచనలు, సంకల్పానికి అనుగుణంగా టీజీపీఎస్సీ వ్యవస్థను ప్రక్షాళన చేసి, నిరుద్యోగ యువతకు వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించి, అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలను పూర్తి చేసిన టీజీపీఎస్సీ ఛైర్మన్, ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.