నీటి భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత:మంత్రి అచ్చెన్నాయుడు

Spread the love

నీటి భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.  రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలాలు పెంచేలా చెరువులు నింపడం, ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌ల పునరుద్ధరణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. రాష్ట్రంలోని 60 వేల నీటి సంఘాలు రాబోయే 100 రోజుల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేసి భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.  శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని సంతబొమ్మాళి మండలం నౌపాడ ఆర్ & ఆర్ కాలనీలో “నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీల్లో పర్యటించి మూలపేట పోర్టు నిర్వాసితుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం కాలనీలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యపై అధికారులతో మాట్లాడి, రాబోయే 90 రోజుల్లోగా శాశ్వత తాగునీటి సౌకర్యం పూర్తి చేయాలని ఆదేశించారు.  దేవునల్తాడ నుండి పైపుల ద్వారా వంశధార నీటిని అందించేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం మూలపేట నిర్వాసితులను నిర్లక్ష్యం చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆక్షేపించారు. శ్రీకాకుళం జిల్లా ప్రయోజనాల విషయంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ రాజీ పడదన్న ఆయన 30 ఏళ్ల నేరడి బ్యారేజ్ వివాదంపై ప్రభుత్వం 18 నెలలు కోర్టులో గట్టిగా పోరాడి ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ సాధించడం శ్రీకాకుళం  జిల్లాకు దక్కిన చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు.  నేరడి బ్యారేజ్ నిర్మాణం పూర్తైతే లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం చాలా వరకు తగ్గుతుందన్నారు. గత పాలకులు వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో భారీ అవినీతికి పాల్పడటమే కాకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా పనులను నిలిపివేశారని విమర్శించారు.  ఇప్పుడు ఆ బిల్లులను క్లియర్ చేసి పనులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతులకు సాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరా కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *