అగ్రహీరో జూ.ఎన్టీఆర్ భారీ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గురించి వస్తున్న రూమర్స్ పై సినిమా నిర్మాణ సంస్థ స్పష్టతనిచ్చింది. సినిమా షూటింగ్ రద్దు, లుక్ గురించి పుకార్లు వస్తుండడంతో ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది. సినిమా లుక్ గురించి లేదా షెడ్యూల్ రద్దు గురించి ప్రచారంలో ఉన్న పుకార్లలో ఏమాత్రం నిజం లేదు. సినిమా పనులు ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయి, కేవలం సాధారణ సన్నాహక విరామం (preparation gap) మాత్రమే తీసుకున్నాము. ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని లేదా ప్రచారం చేయవద్దని అందరినీ కోరుతున్నాము. అధికారిక అప్‌డేట్లు ఎల్లప్పుడూ మా నుండే వస్తాయని మైత్రి మూవీ మేకర్స్ తెలిపింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చింది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. దేవర విజయం తరువాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచాలున్నాయి.