భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ మానిటరింగ్ పాలసీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేడు తెలిపారు. ఈసారి రెపో రేటును మార్చడం లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుకోని సవాళ్లు ఎదురవుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు గ్రోత్ కు అడ్డంకిగా మారాయన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చమురు ధరల్లో పెరుగుదల ప్రభావం ద్రవ్యోల్భణంపై పడుతోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రిటైల్ ద్రవ్యోల్భణం 4.6 శాతంగా ఉండవచ్చని తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీ నాటికి ఆర్బీఐ వద్ద 696.1 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక కేంద్ర బ్యాంకు రెపో రేటును చివరిసారి గత సంవత్సరం డిసెంబర్ లో సవరించింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో నిర్వహించిన సమీక్షలో వడ్డీ రేటు యథాతథంగా ఉంచింది. వాణిజ్య బ్యాంకులు తమకు అవసరమైనప్పుడు ఆర్బీఐ దగ్గర తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీ రేటునే “రెపో రేటు” అంటారు. రెపో రేటును పెంచినా లేదా తగ్గించినా, అది నేరుగా మీ జేబుపై ప్రభావం చూపుతుంది.