రహదారులు మరియు భవనాలు, రవాణాశాఖ లపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు అమరావతి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పై సమీక్షలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగం పై సమీక్షలో చర్చించారు. రాష్ట్రంలో ఉన్న 45 వేల కిలోమీటర్ల పైచిలుకు రహదారులు నిర్వహణ పటిష్టంగా ఉండాలని సీఎం ఆదేశించారు. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి దాని ఆధారంగా రోడ్ల నిర్మాణం జరగాలని సూచించారు. మెరుగైన రోడ్ల ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలని పేర్కొన్నారు. అతి తక్కువ వ్యయానికే ప్రజా రవాణా జరిగేలా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలను మరింత పటిష్టం చేసే దిశగా జాతీయ, రాష్ట్ర రోడ్ల నిర్మాణం జరగాలని సీఎం దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించే విధంగా నిర్మాణం చేపట్టాలని సూచించారు. మొత్తంగా 45,433 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటే… వాటిల్లో ప్రతి సంవత్సరం 10,238 కిలోమీటర్ల మేర నిరంతర నిర్వహణ చేయాల్సి ఉందన్నారు. ప్రజలకు రోడ్ల వల్ల ఇబ్బంది లేకుండా చూడాలని రోడ్ల నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియగా చేపట్టాలన్నారు. ఎక్కడైనా రోడ్లకు గుంతలు పడితే… వాటినే వెంటనే సరిదిద్దితే ఇక ఇబ్బందులు ఉండవు. రోడ్ల నిర్వహణలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి పద్దతులను అవలంబిస్తున్నారనే అంశాన్ని అధ్యయనం చేయాలన్నారు. ఆర్ అండ్ బీ రహదారుల మెయింటెనెన్స్ కోసం నిధుల కొరత లేకుండా చూడాలని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోడ్ల మరమ్మతులు చేపట్టాలన్నారు. గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తంగా 471 గ్రామాల్లో రోడ్లను మరమ్మత్తులు చేపట్టాలిని గ్రేటర్ రాజమహేంద్రవరం పరిధిలో చేపట్టే రోడ్ల అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా పనులు ఉండాలని సూచించారు. పుష్కరాలకు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.400 కోట్లతో 531 కిలోమీటర్ల పొడవైనరోడ్లను అభివృద్ధి చేయాలి. దీని కోసం సాస్కీ నిధులను వినియోగించుకోవాలని తెలిపారు.