మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 87వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహించారు. సామాన్యులు, పార్టీ కార్యకర్తల నుండి వినతులు స్వీకరించారు. సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా డిపోను తరలించకుండా చూడాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. కోవిడ్ వల్ల నష్టపోయిన హైర్ బస్ యజమానుల బస్సులకు రీప్లేస్ మెంట్ కల్పించి ఆదుకోవాలని యజమానులు కోరారు. వంశపారంపర్యంగా సంక్రమించిన తమ 2.63 ఎకరాల భూమిని ఆక్రమించారని, విచారించి న్యాయం చేయాలని కర్నూలు జిల్లా గుండంపాడుకు చెందిన ఎస్.చిన్న శివమ్మ కోరారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు నారా లోకేష్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
టాప్ 10 ఫెర్ఫార్మర్స్ తో ఆత్మీయ భేటీ
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని మంత్రి లోకేష్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ‘మై టీడీపీ యాప్’ సమర్థ వినియోగం, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న టాప్ 10 ఫెర్ఫార్మర్స్ తో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.