మన పార్టీకి ఉన్న కష్టకాలం పోయింది, త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు:కే.టీ.ఆర్

Spread the love

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఆ విషయం మర్చిపోయి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.అన్ని వర్గాలను మోసం చేస్తూ, తన వారి కోసం పేదవాళ్ల భూములను అరాచకంగా గుంజుకుంటున్న రేవంత్ రెడ్డి, తెలంగాణ చరిత్రలో ఒక చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని చీత్కరించే రోజులు తప్పకుండా వస్తాయని మండిపడ్డారు. ఈరోజు ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన చైర్‌పర్సన్, కౌన్సిలర్లను, సర్పంచ్‌ లను ఈ సందర్భంగా  సన్మానించారు. ఇక మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు, పార్టీ యువ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని ప్రత్యేకంగా కేటీఆర్ అభినందించారు. మంచి నాయకత్వం, మొండితనం ఉన్న నాయకత్వం ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని ప్రశాంత్ ఈ ఎన్నికల్లో సాధించిన విజయం నిరూపించిందని పేర్కొన్నారు. ఈరోజు మున్సిపల్ ఎన్నికల అనంతరం దాదాపు రెండు నెలల పాటు అన్ని రకాల అన్యాయాలు, అక్రమాలు చేసిన తర్వాత ఇబ్రహీంపట్నం మరియు క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరిందన్న విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు. మెజారిటీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ వాళ్లు గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అక్రమంగా చైర్మన్ పదవులను తీసుకునేందుకు అనేక దురాగతాలకు పాల్పడిందని, అయితే చివరికి న్యాయం గెలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. అక్రమ కేసులను ఎదుర్కొని పార్టీ వెంటనే నిలబడి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్న శ్రేణులకు  పేరునా ధన్యవాదాలు తెలిపారు. రెండున్నర సంవత్సరాల పాటు మన పార్టీకి ఉన్న కష్టకాలం పోయిందని, త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయన్నారు.  అధికారులు కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు లొంగి అక్రమాలకు పాల్పడితే వదిలిపెట్టే ప్రసక్తి లేదని, రానున్న ప్రభుత్వంలో వారందరినీ గుర్తుంచుకొని మరీ తగిన విధంగా శిక్షిస్తామన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజల కోసం పని చేయాలని కేటీఆర్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *