కాకినాడ జిల్లా రోడ్డు వీడియో..అది నాణ్యతా లోపం కాదు:స్పష్టం చేసిన ఫ్యాక్ట్ చెక్

Spread the love

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా సంవత్సరాల తరబడి నిర్మాణాలకు, మరమ్మత్తులకు నోచుకోని రోడ్లను ఇటీవలే వేగవంతంగా చక్కదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా  నాణ్యతకు సంబంధించి ప్రజల్లో అపోహ కలిగే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్న విషయంపై ఏపీ ప్రభుత్వ  ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టతనిచ్చింది. అటువంటి విషయం  ప్రభుత్వం దృష్టికి వచ్చిందని  కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రాంతంలో ఇటీవల వేసిన తారు రోడ్డు నాణ్యతపై ఉద్దేశపూర్వకంగా ఒక వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో కొందరు సర్క్యులేట్ చేస్తున్నారని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన అసలు విషయాన్ని వివరించింది. కొత్తగా నిర్మించిన ఆ రోడ్డుకు సంబంధించిన బిల్లులను కాంట్రాక్టర్ కు చెల్లించే ముందు నాణ్యతా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. క్వాలిటీ టెస్టులు నిర్వహించేందుకు రోడ్డు మధ్యలో గుంత తీస్తారు. క్వాలిటీ టెస్టులు  పూర్తి అయిన తర్వాత ఆ గుంతలను తాత్కాలికంగా పూడుస్తారని ఇదే అదనుగా భావించిన కొందరు తాత్కాలికంగా పూడ్చిన ఆ గుంతను, అందులోని మెటీరియల్ ను చూపించి రోడ్డు క్వాలిటీపై అపోహలు కలిగే విధంగా వీడియో తీశారని తెలిపింది. రోడ్లు మాత్రమే కాకుండా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పారదర్శకత, ఉన్నత ప్రమాణాల పట్ల నిబద్ధతతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని పేర్కొంది. రాష్ట్రంలోని సామాజిక తనిఖీ వ్యవస్థ వరుసగా రెండో సంవత్సరం కూడా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి, శాతం వంద తనిఖీలు, పర్యవేక్షణ సాగిస్తున్నదని స్పష్టం చేసింది.  అపోహలు సృష్టించే విధంగా తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *