మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ⅔ వంతు మెజారిటీ సాధించలేకపోయింది. 298-230 ఓట్ల తేడాతో ఆ బిల్లు వీగిపోయింది. దీనిపై హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఈరోజు లోక్ సభలో అత్యంత విచిత్రమైన దృశ్యం ఒకటి చోటు చేసుకుంది. ‘నారీ శక్తి వందన్ అధినియం’ కోసం ఉద్దేశించిన అత్యంత కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే మరియు సమాజ్ వాదీ పార్టీలు అడ్డుకున్నాయి. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును తిరస్కరించడం, దానిపై వేడుకలు చేసుకోవడం మరియు విజయ నినాదాలు చేయడం నిజంగా గర్హనీయం మరియు ఊహకు అందని విషయమని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు, దేశంలోని మహిళలకు లోక్ సభ మరియు రాష్ట్ర శాసనసభలలో లభించాల్సిన 33% రిజర్వేషన్ హక్కు ఇక దక్కదు. కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు, పదేపదే ఇలా చేస్తూనే ఉన్నారు. వారి ఆలోచనా విధానం మహిళల ప్రయోజనాలకు గానీ, దేశ ప్రయోజనాలకు గానీ ఏమాత్రం అనుకూలంగా లేదని దుయ్యబట్టారు. నారీ శక్తికి జరిగిన ఈ అవమానం ఇక్కడితో ఆగదని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను. ఇది దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. ప్రతిపక్షాలు కేవలం 2029 లోక్ సభ ఎన్నికల్లోనే కాకుండా, ప్రతి స్థాయిలోనూ, ప్రతి ఎన్నికల్లోనూ మరియు ప్రతి చోటా ‘మహిళల ఆగ్రహాన్ని’ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.