మళ్లీ ఓడిన కోల్ కతా..గుజరాత్ ఘన విజయం

Spread the love

ఐపీఎల్ సీజన్ 19లో గుజరాత్ టైటాన్స్ మొదటి రెండు మ్యాచ్ లలో ఓడినప్పటికీ ఆ తరువాత వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. కోల్ కతా గెలుపు నిరీక్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా గుజరాత్ టైటాన్స్-కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన కోల్ కతా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. కామెరూన్ గ్రీన్ 79 (55; 7×4, 4×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. రోవ్ మన్ పావెల్ 27 (20; 2×4, 2×6) పరుగులు చేయగా..మిగిలిన బ్యాటర్లు నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రబడా 3 వికెట్లు, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. ప్రసీద్ కృష్ణ, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం గుజరాత్ ఆడుతూ పడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ 86 (50; 8×4, 4×6) అదరగొట్టాడు. బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టి గుజరాత్ ను విజయం వైపు నడిపించాడు. జోస్ బట్లర్ (25), సాయి సుదర్శన్ (22) పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, సునీల్ నరైన్, రమణ్ దీప్, వైభవ్ అరోరా ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ విజయంతో గుజరాత్ ఆడిన 5 మ్యాచ్ లలో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కోల్ కతా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ లో కూడా గెలవకపోవడంతో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *