ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్ కు శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. క్షేమంగా తిరిగి ప్రజా సేవలో నిమగ్నమవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖులు కూడా ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం వై.ఎస్.జగన్, తెలంగాణ కీలక నేత కే.టీ.ఆర్, కేంద్ర మంత్రులు, సినీ నటులు జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, నారా రోహిత్ సహా పలువురు పవన్ త్వరగా కోలుకోవాలని పోస్ట్ లు చేశారు. దీనిపై పవన్ తన అధికారిక ఖాతా ద్వారా స్పందించారు. త్వరలోనే కోలుకుని తిరిగి వస్తానని తన ఆరోగ్యంపై ఆరాతీసి, తాను కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ బదులిచ్చారు. ఈ మేరకు ధన్యవాదాలు తెలిపారు. ఇక మొన్న శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారంనాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు.