ఏపీ సీఎం చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ 

Spread the love

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు 76వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ అభిమానులు సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈరోజు విజయవాడ పటమట లోని అన్నా క్యాంటీన్ లో లబ్ధిదారులతో కలిసి చంద్రబాబు దంపతులు అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం ప్రకటించారు. 

ప్రధాని మోడీ:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి మరియు నా ఆప్తమిత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ప్రజల సేవలో ఆయన నిరంతరం నిమగ్నమై ఉండాలని, ఆయనకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్:

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అనే లక్ష్యాలను నిర్దేశించుకొన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు చిరునామాగా తీర్చిదిద్దటం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తున్నారు. మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని నిజం చేసేలా సాగుతున్న శ్రీ చంద్రబాబు గారి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలుస్తుంది. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను… సంతోషాన్ని అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి:

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

వై.ఎస్.జగన్:

పుట్టినరోజు శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు! మీరు ఆయురారోగ్యాలతో, ప్రశాంతంగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను!

మెగాస్టార్ చిరంజీవి:

మీ దూరదృష్టి, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న అంకిత భావం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. రాష్ట్ర అభివృద్ధి కోసం మీ నిర్విరామ కృషి అందరికీ మార్గదర్శకం.

ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి, ప్రజల కోసం మీరు కనే ప్రతి స్వప్నం సాకారం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. 

జూ.ఎన్టీఆర్:

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు మావయ్య గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇవే విధమైన అంకితభావం మరియు దార్శనికతతో మన ప్రజలకు సేవ చేయడానికి, వారిని నడిపించడానికి అవసరమైన ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు మరియు మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీ నాయకత్వం మన రాష్ట్రానికి నిరంతరం ప్రగతిని, సౌభాగ్యాన్ని మరియు గర్వకారణాన్ని చేకూర్చాలని ఆశిస్తున్నాను.

మహేష్ బాబు:

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీలోని పట్టుదల మరియు దార్శనికత ఎందరికో ఆదర్శం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరియు పరివర్తన పథంలో మీరు ఇలాగే నిరంతరం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.

పుట్టిన రోజు సందర్భంగా సీఎం చంద్రబాబుకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం అందించారు. ముఖ్యమంత్రికి వేంకటేశ్వరస్వామి, దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ప్రసాదం, చిత్రపటాలను టీటీడీ అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి, దుర్గగుడి ఈఓ శీనా నాయక్ అందించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *