ఒక మనిషి ప్రయాణం ఇంత అద్భుతంగా సాగడం నిజంగా విశేషమని విలక్షణ నటుడు విజయ్ సేతుపతి అన్నారు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘బద్రి’ విడుదలై నేటికి 26 సంవత్సరాలు. అంటే డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ కెరీర్ కు 26 ఏళ్లు అయిన సందర్భంగా విజయ్ సేతుపతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సినిమా రంగంలో 26 ఏళ్లు అంటే అది కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు.. ధైర్యం, నమ్మకం మరియు నిర్భయమైన గళంతో నిర్మించుకున్న ఒక గొప్ప వారసత్వమని పేర్కొన్నారు. ప్రియమైన పూరీ సార్, #SLUMDOG – 33 Temple Road సినిమా కోసం మీతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నటులను నమ్మి, వారిలోని ప్రతిభను బయటకు తీసే దర్శకుల కోసం మేమెప్పుడూ ఎదురుచూస్తుంటాం.. మీరు ఆ పనిని చాలా సులభంగా, అద్భుతంగా చేస్తారు. ఈ సినిమా మనందరికీ ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలిచిపోతుందని నేను నమ్ముతున్నాను. మీరు మరెన్నో విజయాలు సాధించాలని, మీ కథలతో మరిన్ని ఏళ్లపాటు మమ్మల్ని మెప్పించాలని కోరుకుంటున్నాను. మీరంటే ఎల్లప్పుడూ నాకు గౌరవం అని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. వీరిద్దరూ సెట్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలతో పూరి జగన్నాథ్ సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, దేశముదురు, బిజినెస్ మ్యాన్ వంటి భారీ హిట్ చిత్రాలతో ప్రేక్షకులలో మంచి స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆయన సినిమాలలో హీరో క్యారెక్టరైజేషన్ కు స్పెషాలిటీ ఉంటుంది. మరీ ముఖ్యంగా పూరి జగన్నాథ్ డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక ఆయన ప్రస్తుతం విజయ్ సేతుపతితో #SLUMDOG – 33 Temple Road అనే సినిమా చేస్తున్నారు.