తమిళనాడుకు పూర్వవైభవం రావాలంటే ఎన్డీఏ అభ్యర్థులకే ఓటు వేయాలి:ఏపీ సీఎం చంద్రబాబు 

Spread the love

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీయే పక్షాల తరపున కోయంబత్తూరులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోయంబత్తూరులో స్థానిక వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ఆయన సమావేశమయ్యారు. కోయంబత్తూరు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుండి  పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్ధులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్డీఏ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని చంద్రబాబు కోరారు. తమిళనాడుతో ఏపీకి.. ఎన్టీఆర్ కు, తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  ఎన్టీఆర్ హయాంలోనే తెలుగు గంగ ద్వారా చెన్నైకు నీరిచ్చామని పేర్కొన్న ఆయన నదుల అనుసంధానం జరిగితే… గోదావరి నీళ్లను తమిళనాడుకు ఇవ్వవొచ్చని అన్నారు. నదుల అనుసంధానానికి ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇక ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి జరుగుతోందని, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డిలిమిటేషన్ బిల్లును అడ్డుకుని డీఎంకే సహా ఇండి కూటమి భాగస్వామ్య పక్షాలు తప్పు చేశాయని విమర్శించారు.  కేంద్రం తీసుకురావాలనుకున్న  డిలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగేదన్నారు. డీఎంకే సహా ఇండి కూటమి తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలిగిందని దుయ్యబట్టారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలివి ద్రవిడ సంస్కృతేనని పాండ్యులు, చోళులు పాలించిన నేల తమిళనాడని కొనియాడారు.  అత్యంత ప్రాచీన భాష తమిళమని తల్లి భాషను తమిళులు ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరన్నారు. సుబ్రమణ్య భారతి, కణ్ణగి, తిరువళ్లవర్, సీవీ రామన్ లాంటి ఎంతో మంది ప్రముఖులను గుర్తుచేసుకున్నారు. ఇక తమిళనాడు లో సుందరమైన పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఇంకెక్కడా లేవు.రామేశ్వరం, తంజావూరు, అరుణాచలం లాంటి దివ్యక్షేత్రాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తారన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోడానికి కుప్పంలో ద్రవిడ యూనివర్సిటినే ఏర్పాటు చేసినట్లు వివరించారు. తమిళనాడుతో తెలుగు వారికి మంచి సంబంధాలే కొనసాగుతున్నాయన్నారు. ఎన్టీఆర్ – ఎంజీఆర్ స్నేహం గురించి మాట్లాడారు. తన  వివాహం కూడా చెన్నైలోనే అయ్యిందని గుర్తు చేసుకున్నారు.  అన్నాడీఎంకే అంటే గుర్తు వచ్చేది జయలలితగారే. మళ్లీ గెలిచేది ఏఐఏడీఎంకే- బీజేపీ కూటమేనని అన్నారు. తమిళనాడుకు పూర్వవైభవం రావాలంటే ఎన్డీఏ అభ్యర్థులకే ఓటు వేయాలన్నారు. కేంద్రం సహకరిస్తున్నా డీఎంకే దానిని వినియోగించుకోవటం లేదని డీఎంకే హయాంలో నేరాల రేటు బాగా పెరిగిపోయిందని విమర్శించారు. జయలలిత స్థాపించిన ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలవాలి. అభివృద్ధి సాధించాలన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తే అభివృద్ధి అంటే ఏమిటో మీరే చూస్తారని ప్రజలకు పిలుపునిచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *