ఒకవైపు అగ్రరాజ్యంతో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా మరోవైపు ఇరాన్ లో అధికార నియంత్రణ కోసం రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందా అనే ప్రశ్నకు అంతర్జాతీయంగా అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇరాన్ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం అత్యంత సంక్లిష్టమైన దశలో ఉంది. ఒకవైపు అమెరికా వంటి అగ్రరాజ్యాలతో దౌత్యపరమైన, సైనికపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, దేశం లోపల అధికార నిర్ణయాల విషయంలో అంతర్గత పోరు ముదురుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇరాన్ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఉమ్మడిగా పోరాడాల్సిన రెండు బలమైన శక్తుల మధ్య ఆధిపత్య పోరు ఇరాన్ కే సంకటంగా మారే ప్రమాదం ఉందా అనే వాదన వినిపిస్తోంది. ఇరాన్ నాయకత్వంలో ఎంతో కీలకంగా ఉన్న ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్టీసీ) ఒక వైపు అలాగే రాజకీయ నాయ కత్వం మరో వైపు అధికారంపై పట్టు నిలుపుకునేందుకు పావులు కడుపుతుండడం ఇరాన్ లోనే కాకుండా ప్రపంచ రాజకీయాల్లో కూడా ఆసక్తికరంగా మారింది. అమెరికా దళాలకు ధీటుగా బదులిస్తూ పటిష్టంగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన ఐఆర్జీసీ ప్రభుత్వంపై పట్టు బిగించడాన్ని ఇరాన్ సీనియర్ రాజకీయ లీడర్లకు అంతగా నచ్చడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఈ క్రమంలో ఇరాన్ కీలక నేతలంతా కలిసి తమ అగ్రనేత మోజ్తాబా కు రాసిన సీక్రెట్ లెటర్ ఇప్పుడు ఇరాన్ లో సరికొత్త చర్చకు తెరలేపింది. ఈ లెటర్ పై ప్రభుత్వం లోని సీనియర్ అధికా రులు కూడా సంతకాలు చేయడం సంచలనం సృష్టించింది. సంతకం చేసిన వారిలో పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్, ప్రెసిడెంట్ పెజెష్కియాన్, విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వంటి సీనియర్ నేతలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇరాన్ ఉన్న కఠిన పరిస్థితుల నేపథ్యంలో అగ్ర లీడర్షిప్ తన వ్యూహాలను మార్చుకోవాలని లేఖలో సదరు లేఖలో కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేశంలో ఇప్పుడు కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభంపై వారు తమ సుప్రీం లీడర్ ను అలెర్ట్ చేశారు.
దేశం ఆర్ధికంగా మరింత దిగజారకుండా ఉండాలంటే సత్వర కీలక నిర్ణయాలు తీసు కోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడు అవలంబిస్తున్న ఈ వైఖరి కారణంగా దేశ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. దానికి అనుగుణంగా విదేశాంగ విధానంలో మార్పులు తీసుకురావా లని వారు మొజాబాకు విన్నవించారు. ప్రభుత్వంపై ఐఆర్జీసీ ప్రభావం పరిధి దాటుతోందని పాలనలో సైన్యం జోక్యం అదుపులో ఉండి, ఎన్నికైన ప్రతినిధుల మాటలకు విలువ ఇవ్వా లని కూడా ఆ లెటర్ లో కోరారు.
ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్న ఒక దేశంలో, రెండు వర్గాల మధ్య అధికారం లేదా నాయకత్వం కోసం సాగే పోరాటం ఆ దేశపు సామాజిక మరియు ఆర్థిక పునాదులను పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉందని ప్రపంచ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికార నియంత్రణ కోసం రెండు వర్గాలు ఉగిసలాడుతుంటే అది అంతర్యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది. అస్థిరత వల్ల సంక్షోభం విస్తరించే ప్రమాదం కూడా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా, ఇటువంటి పోరాటాలు దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని బలహీనపరుస్తాయి. అంతర్గత కలహాలను ఆసరాగా చేసుకుని అంతర్జాతీయ శక్తులు తమ స్వలాభం కోసం జోక్యం చేసుకోవడం మొదలుపెట్టే ఆస్కారం కూడా ఉందంటున్నారు. నాయకత్వ పోరాటంలో పట్టు నిలుపుకున్న పక్షం ఒకవేళ నియంతృత్వ పోకడలు అవలంబిస్తే, ఆ దేశం అంతర్జాతీయ సమాజం నుండి ఏకాకిగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఒక రాజకీయ నియంత్రణ మాత్రమే కాకుండా ఆ దేశపు ఉనికికే ముప్పుగా మారుతుందని అందుకే రెండు వర్గాలు ఉమ్మడిగా పనిచేస్తేనే శత్రు దేశం ముందు ధీటుగా నిలబడి పోరాడేందుకు వీలుంటుందని చెబుతున్నారు. అంతర్జాతీయంగా అగ్రరాజ్యంతో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ఒకవైపు వేధిస్తుంటే, మరోవైపు దేశంలోని విభిన్న పరిస్థితులకు తోడు ప్రజల్లో ఉన్న అసహనం ఈ రెండు వర్గాలకు సవాలుగా మారింది. అధికార నియంత్రణ కోసం కాకుండా రెండు వర్గాలు సమన్వయంతో ముందుకు సాగితే అది కేవలం ఇరాన్ భవిష్యత్తునే కాకుండా మధ్య ప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయాలను కూడా శాసిస్తుంది. అందుకే ఇటువంటి అంతర్గత మధనంలో చిక్కుకోకుండా ఇరాన్ సరైన నిర్ణయాల వైపు నడుస్తుందా లేక మరేదైనా మార్పుకు ఆస్కారం ఉంటుందా అనేది వేచి చూడాలి.