ఇరాన్ లో తీవ్ర ఆర్థిక సంక్షోభం..!ఒక కోడిగుడ్డు ధర ఎంతో తెలుసా..?

Spread the love

తమ భౌగోళిక పట్టును నిలుపుకుంటూ ఊహలకు మించి అమెరికా వంటి మహాశక్తిని ఎదుర్కోవడంలో ఇరాన్ ప్రదర్శిస్తున్న దూకుడు  అంతర్జాతీయ సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోన్న సంగతి తెలిసిందే.  అత్యాధునిక సాంకేతికత, అపరిమితమైన వనరులు కలిగిన అగ్రరాజ్యాన్ని సైతం ఆత్మరక్షణలో పడేసేలా ఇరాన్ తన సైనిక వ్యూహాలతో చెలరేగింది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మరోవైపు చూస్తే ఆ దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారుతుందనే అంశం కలవరం రేపుతోంది. ఇరాన్ ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుందో అది పరోక్షంగా అంతర్జాతీయ పరిస్థితులను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 

ఇప్పటివరకు కూడా ఇరాన్ కేవలం నేరుగా యుద్ధం చేయడమే కాకుండా, మిడిల్ ఈస్ట్  అంతటా విస్తరించిన తన ప్రభావిత పవర్స్ తో అమెరికాను కట్టడి చేయగలిగింది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధి వంటి ప్రాంతాలను తన అదుపులో ఉంచుకోవడం ద్వారా, యుద్ధం సంభవిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయగలమని ఇప్పటికే తన హెచ్చరికలు తీవ్రతరం చేసింది. ఇక  భౌగోళికంగా ఎంతో క్లిష్టమైన సైనిక స్థావరాలు ఇరాన్‌ సత్తా చూపాయి. ఊహించని విధంగా ఎదురుదాడి చేయడంలో ఇరాన్ దూకుడు  అగ్రరాజ్యన్ని కూడా అడుగు వేసే ముందు పదేపదే ఆలోచించేలా చేసింది. యుద్ధంలో అమెరికాకు  గట్టిగానే నిలబడుతున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం ఆ దేశం ఆర్థికంగా తీవ్ర సవాళ్లను  ఎదుర్కొంటోంది. ఎప్పుడు ముగుస్తుందో తెలియని యుద్ధం దాని పరిణామాలు గుబులు రేపుతున్నాయి. మండుతున్న ధరలు మరోవైపు తగ్గుతున్న ఆదాయం వంటి అంశాలు ఇరాన్ ను ఇబ్బందిపెడుతున్నాయి.  నిత్యావసర వస్తువుల ధరలు తీవ్రస్థాయిలో పెరిగిపోవడం అక్కడి పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. బియ్యం, కోడిగుడ్లు, తదితర ఆహార వస్తువుల ధరలు భారీ స్థాయిలో పెరిగిపోయి సామాన్యుడికి పెను భారంగా మారాయి. ఒక్క కోడిగుడ్డు ధర 2 లక్షల రియాల్స్ పలుకుతోందంటే తీవ్రత స్థాయిని అర్ధం చేసుకోవచ్చు. ఆహార ద్రవ్యోల్బణం 112 శాతానికి చేరుకుందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.  వంట నూనెల ధరలైతే 200% పైగా పెరిగడం ఆర్థికంగా దుర్భర పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతోంది. అటు నిత్యావసరాలే కాకుండా మిగిలిన అవసరాలకు సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతుండడం ఇరాన్ దయనీయస్థితిని చూపుతోంది. అధికారిక లెక్కల ప్రకారం యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి  ఇరాన్లో 10 లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకోగా..  అనధికారి కంగా ఈ సంఖ్య 20 నుంచి 30 లక్షల వరకు ఉండే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇరాన్ రియాల్ విలువ కూడా కనిష్ఠానికి పడిపోయి ఎప్పుడు లేనంత పరిస్థితిని చూస్తోంది. ఒక డాలర్ విలువతో పోలిస్తే ఇరాన్ కరెన్సీ విలువ మరి దారుణంగా ఉంది. దీంతో ప్రజలపై ఈ ప్రభావం పడుతోంది. ప్రజల దగ్గర నగదు లేక కొనుగోలు శక్తి తగ్గిపోయి అమ్మకాలు తగ్గి, వ్యాపారాలు నష్టాల్లో నడుస్తూ మూతపడేస్థాయికి చేరుతున్నాయి. యుద్ధ సమయంలో కూడా ప్రభుత్వం ట్యాక్స్ లు  తగ్గించక పోగా లోన్స్ కట్టడం ఆలస్యమైతే జరిమానాలు విధిస్తుండడం దారుణ పరిస్థితిని తలపిస్తోంది. చెక్కులు బౌన్స్ అవుతూ  బ్యాంక్లు కూడా  చాలా ఖాతాలను మూసివేస్తున్నాయి. మార్కెట్లో వస్తువులు ఉన్నా కొనుగోలు శక్తి ప్రజలకు లేక దీన పరిస్థితి కనిపిస్తోంది. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే ద్రవ్యోల్బణం మరింత చెలరేగే పరిస్థితులే కనిపిస్తున్నాయి ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు స్టాక్ మార్కెట్ పరిస్థితి అంతే దారుణంగా తయారైంది. టెహ్రాన్ స్టాక్ ఎక్స్ చేంజ్ వరుసగా 8 వారాలు మూతపడడం ఆ దేశ చరిత్రలోనే మొదటి సారంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. మార్కెట్ తెరిచినా ప్రధాన రంగాల స్టాక్స్ లో ధరలు భారీగా పతనమయ్యే అవకాశం ఉండనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిడిల్ ఈస్ట్ లో  నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గి, శాంతి పునరుద్ధరణ జరగాలని ఇరాన్ సామాన్య ప్రజానీకం గట్టిగా ఆకాంక్షిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితితో  పెరిగిన నిత్యావసరాల ధరలు తగ్గి తిరిగి సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలనే ఆకాంక్షిస్తున్నారు. యుద్ధ వాతావరణం కనుమరుగై  పొరుగు దేశాలతో సత్సంబంధాలు తిరిగి ఏర్పడితే తమ రోజువారీ జీవితాలు ప్రశాంతంగా ఉంటాయని వారు ఆశిస్తున్నారు. శాంతి స్థాపన జరిగితే విద్య, వైద్యం నిత్యావసరాలు అందుబాటులోకి వచ్చి తిరిగి  అభివృద్ధి సాధ్యమవుతుందని, తద్వారా రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించవచ్చని అక్కడి ప్రజల కోరిక. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య మార్గాలు తెరుచుకుని, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తిరిగి ట్రాక్ లో పడాలని  యువత మరియు వ్యాపార వర్గాలు ఎదురుచూస్తున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *