రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పెండింగ్ బకాయిల కోసం ఈరోజు 1000 కోట్ల రూపాయల నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా కేటాయించే 700 కోట్ల రూపాయలను, ఉద్యోగుల ఆర్థిక అవసరాల దృష్ట్యా 1000 కోట్ల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ నిధులతో అక్టోబర్ 2025 వరకు పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలన్నింటినీ పూర్తిగా క్లియర్ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఉద్యోగుల మెడికల్ బిల్లులను ఎలాంటి జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు చెల్లించాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమని, వారి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు.