ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి సమంత ఆమె కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు, గుర్తుండిపోయే పాత్రలు చేశారు. ఇక ఆమె తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మొదట ఈ సినిమా మే 15న విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అందుకు తగ్గట్లే పోస్టర్స్ కూడా విడుదల చేసి, రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. దీంతో అభిమానులు కూడా ఆ తేదీని గుర్తుంచుకున్నారు. కానీ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. జూన్ మొదటి వారానికి వాయిదా పడే అవకాశముందని వార్తలు వినిపించాయి. ఇదే సమయంలో మరో భారీ సినిమా ‘పెద్ది’ జూన్ 4న విడుదల అవుతుందని ప్రకటించడంతో, ‘మా ఇంటి బంగారం’ టీమ్ కాస్త ఆలోచనలో పడినట్లు టాక్ వచ్చింది. ఎందుకంటే ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు, అదే సమయానికి చిన్న లేదా మిడ్‌రేంజ్ సినిమా విడుదల చేస్తే, అది ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా ‘మా ఇంటి బంగారం’ విడుదలను మళ్లీ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఇప్పుడీ రూమర్స్ మరింత ముందుకు వెళ్లి, ఈ సినిమా ఏకంగా జూలైకి వాయిదా పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోవడం గమనించాల్సిన విషయం. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది.
ఇక సమంత గత ఏడాది దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం చేసుకుని, తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ సినిమాపై అందరి దృష్టి పడింది. దర్శకురాలు నందిని రెడ్డికి ఫీల్ గుడ్, ఎమోషనల్ సినిమాలు చేయడంలో మంచి పేరు ఉంది. ఈ సినిమాలో సమంత ఒక హౌస్ వైఫ్ పాత్రలో కనిపించనుంది. ఐతే అది కేవలం సింపుల్ పాత్ర కాదు… దీనిలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని టీజర్ ద్వారా ఇప్పటికే స్పష్టమైంది. టీజర్ చూసినవారికి ఒక విషయం అర్థమైంది… ఈ సినిమా ఒక కొత్త తరహా కథతో రానుందని. ఒక సాధారణ గృహిణి ఎలా అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటుంది, ఎలా మారుతుంది అన్నది ఇందులో చూపించబోతున్నారని అర్థమవుతోంది. ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించే అవకాశం ఉంది.