రోహిత్ శర్మ కమ్ బ్యాక్..లక్నో పై ముంబై భారీ విజయం 

Spread the love

ఐపీఎల్ సీజన్ 19లో పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ జట్టు తాజాగా మంచి విజయాన్ని అందుకుంది. సొంత మైదానం వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో  జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సత్తా చాటింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ 63 (21 బంతుల్లో; 1×4, 8×6) విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. మిచెల్ మార్ష్ 44 (25; 4×4, 3×6), హిమ్మత్ సింగ్ 40 (31; 2×4, 2×6), మార్క్రమ్ 31 నాటౌట్ (25; 1×4, 1×6) పరుగులు చేశారు. దీంతో భారీ స్కోరును ముంబై ఇండియన్స్ ముందు ఉంచింది. ముంబై బౌలర్లలో కోర్బిన్ బాష్ 2 వికెట్లు, ఘజన్ ఫర్, విల్ జాక్స్, రఘు శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే ఆ భారీ టార్గెట్ ముంబై ముందు ఏ మాత్రం సరిపోలేదు. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ 84 (44; 6×4, 7×6), రికెల్టన్ 83 (32; 6×4, 8×6)ల ధాటికి స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ముఖ్యంగా రోహిత్ శర్మ కమ్ బ్యాక్ అభిమానులకు మంచి ట్రీట్ ను ఇచ్చింది. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 143 పరుగులు జోడించారు. సూర్యకుమార్ యాదవ్ (12), తిలక్ వర్మ (11) స్వల్ప పరుగులు మాత్రమే చేయగలిగారు. అయినప్పటికీ ముంబై ఎక్కడా తడబడలేదు. నమన్ ధీర్ 23 నాటౌట్, విల్ జాక్స్ 10 నాటౌట్ పరుగులు చేశారు. దీంతో 18.4 ఓవర్లలోనే ముంబై లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. మణిమారన్ సిద్దార్థ్ 2 వికెట్లు, మోసిన్ ఖాన్, మహ్మద్ షమీ ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ విజయంతో ముంబై ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ లలో 3 విజయాలు 7 పరాజయాలతో 6 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. లక్నో 9 మ్యాచ్ లలో 2 గెలుపులు, 7 ఓటములతో 4 పాయింట్లతో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *