కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన అంశాలను పరిష్కరించాలని కోరుతూ సీఆర్ పాటిల్ కు విజ్ఞప్తి చేశారు. 2027 గోదావరి పుష్కరాల లోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందించాలని కోరారు. తొలిదశలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు. స్వయంగా 5 సార్లు ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని సమీక్షించినట్టు తెలిపారు. 2026 ఏప్రిల్ 2 నాటికి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి అయ్యిందని, గ్యాప్ 1, గ్యాప్ 2 లలో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందన్న కారణంతో 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు. దీంతో పోలవరం ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా చేపట్టేందుకు వీలవుతుందని చెప్పారు. సాగునీటి అవసరాల దృష్ట్యా మొదట నిర్ణయించిన దానికంటే కుడి, ఎడమ కాలువల సామర్ధ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచినట్టు వివరించారు. ప్రాజెక్టు తదుపరి పనులకు సంబంధించి అవసరమైన నిధులను కూడా మంజూరు చేయాలని కోరారు. ప్రధానమంత్రి కృషి సీంచాయి యోజన కింద రాష్ట్రంలోని వివిధ పథకాల పునరుద్ధరణ, ఆధునీకరణకు నిధులు మంజూరు కోరుతూ లేఖ ఇచ్చారు. హర్ ఖేత్ కో పానీ కార్యక్రమంలో భాగంగా చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణ ,ఆధునీకరణ, కాలువల పూడిక తీత, గట్ల బలోపేతం లాంటి పనులు చేపట్టాల్సి ఉందని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 297 నీటి వనరుల పునరుద్ధరణ కోసం రూ.285 కోట్ల నిధుల్ని విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. సుప్రీం కోర్టు తుది తీర్పు వచ్చేంత వరకూ ఆలమట్టి ఎత్తు పెంచే అంశంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయవద్దని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కు విజ్ఞప్తి చేశారు. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల దాహార్తిని తీర్చే పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.