వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తాజాగా కీలకమైన విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ సీజన్ 19లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.
శ్రేయాస్ అయ్యర్ 59 నాటౌట్ (36 బంతుల్లో; 5×4, 3×6), ప్రియాన్షు ఆర్య 56 (33; 2×4, 6×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. కూపర్ కాన్లీ 38 (27; 3×4, 2×6) ఆఖర్లో సూర్యాన్ష్ షెడ్గే 21 (8; 2×4, 2×6) కూడా ధాటిగా ఆడడంతో భారీ టార్గెట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ముందుంచింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు, మాధవ్ తివారీ 2 వికెట్లు, ముఖేష్ కుమార్ ఒక వికెట్ తీశారు.
ఇక టార్గెట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ కళ్ళు ఇన్నింగ్స్ లో కెప్టెన్ అక్సర్ పటేల్ మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు. 30 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. మరో ఆటగాడు డేవిడ్ మిల్లర్ 51 (28; 3×4, 4×6) హాఫ్ సెంచరీతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అశుతోష్ శర్మ 24 పరుగులతో పర్వాలేదనిపించాడు. మాధవ్ తివారీ 18 నాటౌట్ మెరుపు షాట్లతో అదరగొట్టాడు. దీంతో ఢిల్లీ మరొక ఓవర్ మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ విజయంతో ఆడిన 12 మ్యాచ్ లలో 5 విజయాలు సాధించి టేబుల్ ర్యాంకింగ్స్ లో 7వ స్థానంలో కొనసాగుతోంది. ఇక పంజాబ్ కింగ్స్ ఆడిన 11 మ్యాచ్ లలో 6 విజయాలు ఒక పాయింట్ షేరింగ్ తో 13 పాయింట్లు సాధించి 4వ స్థానంలో కొనసాగుతోంది.