పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గించాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వ పెద్దలు కూడా వెంటనే దానిని ఆచరణలోకి తీసుకొచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు తమ కాన్వాయ్ లను కుదించేసుకున్నారు. సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ లోని 11 వాహనాలను 4 వాహనాలకు కుదించుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తన కాన్వాయ్ లోని 50 శాతం వాహనాలు తగ్గించాలని తన భద్రత అధికారులకు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఈరోజు ఉదయం నుండి కాన్వాయ్ లో మార్పులు చేశారు. అలా ప్రధాని అన్నారో లేదో దేశ ప్రయోజనాలే ప్రాధాన్యతగా తమ కాన్వాయ్ లు తగ్గించుకున్న ఈ ఇద్దరి నేతలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇటీవల ప్రధాని మోడీ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నేపథ్యంలో మన బాధ్యతలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కొన్ని సంకల్పాలు చేసుకుని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చాలని సూచించిన సంగతి తెలిసిందే. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ఏ మార్గాలైనా ఉంటే, వాటిని తప్పకుండా అనుసరించాలని స్పష్టం చేశారు. అందరూ స్థానికంగా తయారైన వస్తువులను కొనుగోలు చేయాలని ఇందుకోసం ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రభుత్వం, ప్రతి సమాజం, ప్రతి సంస్థ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోడీ దేశ ప్రజలను 7 విజ్ఞప్తులు చేశారు. వీలైనంత వరకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (ఇంటి నుండే పని) విధానానికి ప్రాధాన్యత ఇవ్వండి. కనీసం ఒక ఏడాది పాటు బంగారం కొనడాన్ని తగ్గించడం. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించండి; ప్రయాణాలకు మెట్రో లేదా ప్రజా రవాణా వ్యవస్థలను (Public Transport) ఉపయోగించుకోవడం.వంట నూనె వాడకాన్ని తగ్గించుకోవడం. రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయడం. విదేశీ బ్రాండ్ల వాడకాన్ని తగ్గించి, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం. ఒక ఏడాది పాటు విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం వంటి వాటిని ప్రధాని సూచించారు.