టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో శర్వానంద్. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ నుంచి ఎమోషనల్ డ్రామాల వరకు, ప్రేమకథల నుంచి యాక్షన్ సినిమాల వరకు భిన్నమైన పాత్రలు చేస్తూ తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమా ‘నారీ నారీ నడుమ మురారీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు శర్వానంద్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి ఆయన ఒకప్పుడు కామెడీ ఎంటర్టైనర్ లతో అలరించిన దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన శ్రీను వైట్ల, తన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆయన సినిమాల్లో కామెడీ, ఎంటర్టైన్‌మెంట్, హీరోయిజం ప్రత్యేకంగా ఉండేవి. అయితే గత కొన్నేళ్లుగా ఆయనకు సరైన విజయాలు దక్కలేదు. ఇప్పుడు శర్వానంద్‌తో కలిసి మరోసారి ఫుల్ ఎంటర్టైనింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సాధారణ కామెడీ ఎంటర్టైనర్ కాదు అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సరికొత్త కాన్సెప్ట్ ఉండబోతుందట. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోతోందని సమాచారం. నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలని భావిస్తున్నారట. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయని తెలుస్తోంది. జులై 2026 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ టాక్. అంతేకాకుండా వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం హీరోయిన్ ఎంపిక. మొదట ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా పూజ హెగ్డే పేరు వినిపించింది. అలాగే యంగ్ హీరోయిన్ మమిత బైజు పేరూ ప్రచారంలోకి వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరినీ కాకుండా గా మిస్ ఇండియా రన్నరప్‌గా గుర్తింపు పొందిన మానస వారణాసి పేరు ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కథపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. “శ్రీను వైట్ల మళ్లీ తన పాత ఫామ్‌లోకి వస్తారా?”, “శర్వానంద్ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో ఎలా ఉండబోతోంది?” అంటూ అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు “ఢీ”, “రెడీ”, “దూకుడు”, “బాద్షా” వంటి సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన శ్రీను వైట్ల, ఇప్పుడు మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం శర్వానంద్ మరో భారీ ప్రాజెక్ట్‌తో కూడా బిజీగా ఉన్నారు. దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోగి’ సినిమాలో ఆయన నటిస్తున్నారు.