ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంధన ధరలు, సెస్ లు, వ్యాట్ ల అంశంపై ఏపీ కాంగ్రెస్ ఛీఫ్ వై.ఎస్.షర్మిల ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ‘ఎక్స్’ లో కీలక పోస్ట్ పెట్టారు. అత్యధిక ఇంధనం ధరలు ఏపీలో ఉండటమా అడ్వాన్స్డ్ ఆంధ్రప్రదేశ్ అంటే ? అని ప్రశ్నించారు. VAT పేరుతో జనాలను బాదడం దేశానికి ఏపీ రోల్ మోడలా అని ప్రశ్నించారు. సెస్ ల పేరుతో జనాల పర్సులు ఖాళీ చేయడమే విజానా? పొదుపు సంగతి సరే మరి వ్యాట్ పరిస్థితి ఏంటి అని సీఎం చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు. సైకిళ్ళు, ఈ – వెహికిల్లు ఒకే.. మరి లీటర్ ధర మీద అదనంగా రూ.4 గుంజడంపై నియంత్రణ లేదా ? అని దుయ్యబట్టారు. పొదుపు చర్యలు ప్రజలకేనా.. పన్నులు తగ్గించడంలో ప్రభుత్వానికి భాద్యత లేదా ? అభివృద్ధిలో చివరిస్థానం, ఇంధనం ధరల్లో మొదటి స్థానం ఉన్నందుకు సిగ్గుపడాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.77 పైసలు. ఏపీ రాజధాని అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 113. 62 పైసలు. మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్ లో లీటర్ డీజిల్ ధర రూ . 93.75 పైసలు. ఎన్డీయే కూటమిలో పెద్దన్న పాత్ర పోషించే రాష్ట్రం ఏపీలో డీజిల్ ధర రూ 101.24 పైసలు. పక్కరాష్ట్రాలతో పోల్చినా అధిక భారమని అధిక వ్యాట్ , అడిషనల్ వ్యాట్ పేరుతో ఏటా ప్రజలపై పడుతున్న అదనపు భారం అక్షరాల 10 వేల కోట్లని విమర్శించారు. ఆదాయం పెంపు మార్గాలని 2014 నుంచి టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ముక్కుపిండి వసూలు చేయడం దుర్మార్గపు చర్యని మండిపడ్డారు.
పెట్రోల్,డీజిల్ పై వసూలు చేస్తున్న 31 శాతం అధిక వ్యాట్ ను తగ్గించాలని కర్ణాటకలో సేల్స్ టాక్స్ గరిష్టంగా 29 శాతం మాత్రమేనని తమిళనాడులో వ్యాట్ కేవలం 13 శాతమేనని ఇక తెలంగాణలో 35 శాతం వ్యాట్ విధింపు ఉన్నా.. అదనపు వ్యాట్ 4 రూపాయల చార్జీల భారం లేదని అన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని ఇంధనంపై VAT ను భారీగా తగ్గిస్తూ, అదనంగా వసూలు చేస్తున్న 4 రూపాయలను, రోడ్డు సెస్ పేరుతో దోపిడీ చేస్తున్న రూ. 1 ని , మొత్తంగా లీటర్ ధరపై కనీసం 5 రూపాయలు అయినా ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.