కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పనితీరు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తుందని మాజీ సీఎం జగన్ అన్నారు. ఆర్థిక సంవత్సరం 2025-26 కు సంబంధించి కాగ్ (CAG) ప్రచురించిన తాత్కాలిక లెక్కలు రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ఆందోళనకరమైన నిజాలను వెలుగులోకి తెచ్చాయని జగన్ పేర్కొన్నారు. నేడు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కీలక పోస్ట్ చేశారు. ఆర్థిక సంవత్సరం 2025-26 లో రాష్ట్రం 10.75% వార్షిక జీఎస్డీపీ (GSDP) వృద్ధి రేటుతో దూసుకుపోతోందని చంద్రబాబు క్లెయిమ్ చేస్తుంటే దీనికి పూర్తి భిన్నంగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను రాబడులు 3.22% మేర క్షీణించాయన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏ రాష్ట్రంలోనైనా పెట్టుబడులు, వినియోగం అధిక స్థాయిలో ఉంటాయి, ఇది రాష్ట్ర ప్రభుత్వం సేకరించే అధిక పన్ను వసూళ్ల రూపంలో ప్రతిబింబిస్తుందని అయితే నిజానికి , 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతులలో చూపినట్లుగా.. మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2025-26 లో 9.60% వృద్ధి ఉంటుందనే సవరించిన అంచనాలకు భిన్నంగా, రాష్ట్ర ప్రభుత్వ పన్ను రాబడులు 3.22% తగ్గాయన్నారు. రాష్ట్ర పన్ను రాబడులు నిజంగానే 9.60% వృద్ధి చెంది ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న 10.75% జీఎస్డీపీ వృద్ధి అంచనాలను ఎవరైనా నమ్ముతారని అయితే ఇక్కడ జరిగింది సొంత పన్ను రాబడులలో 3.22%మేర క్షీణత నమోదైందని తెలిపారు. గత ప్రభుత్వ చివరి సంవత్సరమైన 2023-24 లో రాష్ట్ర పన్ను రాబడులు రూ. 85,922.23 కోట్లు. రెండేళ్ల తర్వాత, కనీసం 8% సాధారణ వృద్ధిని సాధించినా కూడా, 2025-26 సంవత్సరంలో పన్ను రాబడులు రూ. 1,00,219.69 కోట్లుగా ఉండాలి. కానీ, 2025-26లో సాధించింది కేవలం రూ. 86,552.68 కోట్లు మాత్రమేనని కాబట్టి, ఈ ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది జరిగిన ఊహాజనిత నష్టం అక్షరాలా రూ. 𝟭𝟯,𝟲𝟲𝟳 కోట్లు. చంద్రబాబు “సంపద సృష్టి” గురించి మాట్లాడుతుంటారు, ఇదేనా ఆయన చేసిన సంపద సృష్టి అని జగన్ ప్రశ్నించారు. ఒక సాధారణ ప్రమాణంతో పోల్చినా కూడా రూ. 13,667 కోట్ల తక్కువ రాబడి రావడమేనా? అని ప్రశ్నించారు.