నరసన్నపేటలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరసన్నపేటలో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. స్వచ్ఛరథం డ్రైవర్ నవగపు ప్రసాద్ రావు మండలంలో ఇంటింటికీ వెళ్లి వ్యర్థాల సేకరిస్తున్న విధానాన్ని సీఎంకు వివరించారు. అనంతరం సార్టింగ్ కన్వేయర్ సిస్టమ్ వద్ద అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో సీఎం మాట్లాడారు. అలాగే వ్యర్థాల వర్గీకరణ ప్రక్రియను పరిశీలించారు. గతంలో నేరుగా చేతులతోనే వ్యర్థాలను వర్గీకరించే వారమని, ఇప్పుడు యంత్రాల రాకతో వర్గీకరణ కెపాసిటీ పెరిగిందని వివరించారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కోసం కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ప్రాసెస్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుండి తయారైన ఉత్పత్తులను సీఎం పరిశీలించారు. సమాజంలో మార్పు వస్తేనే స్వచ్ఛాంధ్ర లక్ష్యం సాధ్యం అవుతుందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక 17వ సారి స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. కేవలం మన పరిసరాలు, ఇల్లు, కార్యాలయాలే కాదు.. అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా మన అలవాట్లు కూడా మారాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంచాలా కీలకం. అది ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. మనం నివసించే ఇల్లు, నడిచే వీధులు, తిరిగే సమాజం శుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కేవలం మన నివాసాలు మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమలు, ఈగలు, క్రిమికీటకాలు పెరిగి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అదే పరిసరాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటూ, చెత్తను డస్ట్బిన్లలో పడవేయడం వల్ల రోగాల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. స్వచ్ఛమైన గాలి, పచ్చని చెట్లు, ప్లాస్టిక్ రహిత వాతావరణం ప్రజల మానసిక ప్రశాంతతను, శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయి. పరిశ్రమలు, ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఈ పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు కావడం మంచి కార్యక్రమం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, తడి చెత్త – పొడి చెత్తను వేరు చేయడం, వీధుల్లో బహిరంగంగా ఉమ్మివేయకుండా ఉండడం వంటి చిన్న చిన్న మార్పులు పెద్ద మార్పులు తెస్తాయి. కేవలం మన కోసం మాత్రమే కాకుండా భావి తరాల భవిష్యత్తు కోసం, ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం కోసం ప్రతి ఒక్కరూ, పరిసరాల పరిశుభ్రతను ఒక సామాజిక యజ్ఞంలా ముందుకు తీసుకెళ్లాలి. ఇక ప్రధాని మోదీ పిలుపు మేరకు జిల్లా పర్యటనల్లో కూడా ఇంధన పొదుపు చర్యలను సీఎం చంద్రబాబు పాటించారు. తన కాన్వాయ్‌ను 4 వాహనాలకే కుదించుకుని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం పర్యటించారు.
ఇంధనాన్ని తక్కువగా వాడడం లేదా పొదుపు చేయడం వల్ల ఇంధనాన్ని పొదుపు చేయడం మాత్రమే కాకుండా పర్యావరణానికి, మానవాళికి మంచి ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాల వినియోగం తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలుతగ్గి గాలి కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ఇది గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టడానికి, రాబోయే తరాలకు ప్రకృతి వనరులను కాపాడడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, వ్యక్తిగత స్థాయిలో వాహనాల వాడకం తగ్గించి, ప్రజా రవాణా లేదా సైకిళ్లను ఉపయోగించడం వల్ల ఇంధన ఖర్చులు తగ్గి ఆర్థికంగా లాభం చేకూరుతుంది.
ఇటీవల ప్రజా ప్రతినిధులంతా కూడా సైకిళ్ల బాట పట్టారు. ప్రజల్లో కూడా ఇప్పుడిప్పుడు దీనిపై మార్పు వస్తోంది. క్రమంగా ప్రజలు కూడా ప్రజా రవాణాను ఉపయోగించుకోవడం లేదా ఎలెక్ట్రిక్ వాహనాల వైపు వెళ్లే చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు మరియు సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఇంధనాన్ని పొదుపు చేసుకునే చర్యలు భారతదేశానికి అత్యంత కీలకం. భారత్ తన ముడి చమురు అవసరాలలో దాదాపు 80% పైగా ఇతర దేశాల నుంచే, ముఖ్యంగా పశ్చిమాసియా నుంచే దిగుమతి చేసుకుంటుంది. అక్కడ యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది. ఇటువంటి సమయంలో మనం దేశీయంగా ఇంధనాన్ని పొదుపు చేయడం వల్ల చమురు దిగుమతులపై భారం తగ్గడం దీంతో దేశ విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. కాబట్టి వీలైనంత పొదుపు బాట పడుతున్నారు.