ముసుగు తొలగింది..ఒక్కొక్క లొసుగు బయట పడుతోంది. ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతంలో భరోసా పార్టీ అధ్యక్షుడు, పాస్టర్ డాక్టర్ ధార అభినయ్ దర్శన్ పై జరిగిన దాడి కేసులో సరికొత్త అంశాలు బయటపడుతున్నాయి. పోలీసులు ఊహించని నిజాలను బయటపెట్టారు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వాలనే ఏకైక ఉద్దేశంతోనే, ఆయన కావాలనే ప్లాన్ చేసి తనపై ఈ దాడి చేయించుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రజలను వెర్రివాళ్లను చేద్దామని చూసిన అభినయ్ దర్శన్ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
తనదైన నటనతో డ్రామాకు తెరతీసి వెలుగులోకి వద్దామనుకున్న ఒక ఖిలాడీ అడ్డంగా బుక్ అయ్యాడు. ఇప్పుడు గతంలో అతను పాల్పడిన ఘటనలకు సంబంధించి ఇప్పుడు బయటకు రావడంతో పాస్టర్ అభినయ్ దర్శన్ కు పచ్చివెలక్కాయ గొంతులో పడినట్లయింది. దర్యాప్తులో అతని గురించి విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పాడేరు నియోజకవర్గంలో తనపై తానే దాడి చేయించుకుని డ్రామాతో అనవసర వివాదానికి తెర లేపిన పాస్టర్ అభినయ్ డ్రామా ఎపిసోడ్ వెనుకున్న కుట్ర బయటపడింది. అంతేకాకుండా ఈ క్రమంలో అతనిపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లల్లో నమౌదైన కేసులు, విలాసాల కోసం అతను తొక్కిన అడ్డదారులు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. పాస్టర్ ముసుగులో పలువురు మహిళలను మోసం చేయడం, అదనపు కట్నం కోసం భార్యను వేధించడం వంటి క్రూరమైన చర్యలు తెరపైకి వచ్చాయి. ఆయా ఘటనల్లో కడపకు చెందిన అభినయ్ దర్శన్ పై పలు పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు రిజిస్టరయ్యాయి. ఇంకా ఇందులో వివాహేతర సంబంధాలు, మొదటి భార్యకు తెలియకుండా ఏకకాలంలో పలువురు మహిళలను వివాహం చేసుకోవడం వంటి చీకటి బాగోతలుండడం గమనార్హం.
విలాసాల కోసం అప్పుల ఊబిలోకి భార్యను నెట్టిన దౌర్భాగ్యుడు ఈ అభినయ్. కడప నగరంలోని ఎర్రముక్కపల్లి కందిపాలెం ప్రస్తుతం ప్రకాష్ నగర్‌కు చెందిన అభినయ్ దర్శన్ ఎస్వీ యూనివర్సిటీ నుండి యానిమేషన్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందాడు. 2011లో అతనికి ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.1,50,000 నగదు, 15 తులాల బంగారం కట్నంగా తీసుకున్నాడు. అతనికి కుమార్తెలు ఉన్నారు. అతని భార్యకు యూనియన్ బ్యాంకులో క్యాషియర్‌గా ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌లోని మణికొండకు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ సమయంలో అభినయ్ దర్శన్ తనకు సినిమాల్లో అవకాశాలు వస్తాయంటూ భార్యను ఒత్తిడి చేసి, ఆమె పేరుతో భారీగా అప్పులు తీసుకుని ఆ డబ్బును భార్య అనుమతి లేకుండా హైదరాబాద్‌లో తన వ్యక్తిగత విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఆమెను అప్పుల ఊబిలోకి నెట్టాడు.
ఒకసారి తప్పుకు అలవాటు పడ్డ వాడికి మార్పు అంత త్వరగా వస్తుందా…కుక్క బుద్ది వంకర అన్న చందాన తన నైజాన్ని మరోసారి బయటపెట్టాడు. బ్యాంకు ఉద్యోగిగా ఉన్న భార్యకు బదిలీ కావడంతో కడపకు వచ్చారు. ఈ క్రమంలో తాను మారిపోయినట్లు ఇకపై పాస్టర్‌గా సేవలు చేసుకుంటానని నమ్మించి, కడపలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ద్వారా భార్యతో మళ్లీ భారీగా లోన్లు తీసుకున్నాడు ఈ ప్రబుద్దుడు. భర్తను నమ్మి ఆర్థికంగా అండగా నిలిచింది. ఆ తర్వాత విజయనగరం, రాజమండ్రి, అనకాపల్లి, పాడేరు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పాస్టర్‌గా సేవలు ప్రారంభించాడు. అయితే అతని ప్రవృత్తి అతనిని కుదురుగా ఉండనివ్వలేదు. విజయనగరంలో పాస్టర్‌గా ఉన్న సమయంలో ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని, 2021 మే 15న ఆమెను తీసుకుని పారిపోయి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. దీనిపై ఆ యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల విచారించారు. మొదటి భార్యను సంప్రదించగా అభినయ్ దర్శన్ బుద్ధి మంచిది కాదని, అంతకుముందే విజయవాడలో మరో మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, పెద్దలు, పోలీసుల జోక్యంతో విడిపోయారని సంచలన విషయాలు తెలిపింది.
తన తప్పులను గుట్టు రట్టు చేసిన నేపథ్యంలో అభినయ్ దర్శన్ బెదిరింపుల పర్వానికి దిగాడు. విజయనగరం యువతి తల్లిదండ్రులను ఫోన్లు చేసి చంపేస్తానంటూ బెదిరించాడు. అంతేకాకుండా 2021 మే నెలలో విజయనగరంలోని వారి నివాసానికి వెళ్లాడు… గేటుకు తాళం వేసి ఉండటంతో అక్కడ గొడవ గొడవ చేశాడు. దీంతో విజయనగరం వన్‌టౌన్ పోలీసులు ఇతనిపై క్రైమ్ నెం. 331/2021 U/s 506, 509 IPC కింద కేసు నమోదు చేశారు. ఇటు కడపలోనూ భర్త ప్రవర్తన మారకపోవడంతో మొదటి భార్య కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అభినయ్ దర్శన్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై క్రైమ్ నెం. 172/2021 U/s 498-A, 494 IPC, సెక్షన్ 3, 4 వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులలో కోర్టు పరిధిలో విచారణలో ఉన్నాయి.
ఇక ఇంత నేర నేపథ్యాన్ని పెట్టుకుని ఊరికే ఉండడం ఎందుకు అనుకున్నాడో ఏమో రాజకీయ అరంగ్రేటానికి తెర తీశాడు. భరోసా పార్టీ అనే సంస్థకు వ్యవస్థాపకుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తూ, అభినయ్ దర్శన్ ఫౌండేషన్స్ నడుపుతున్నాడు. ప్రస్తుతం చేంజ్ పీపుల్స్ ఫ్యూచర్ అనే పార్టీ రిజిస్ట్రేషన్ కోసం క్రైస్తవుల నుంచి తలా రూ.10 విరాళం ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా తన బ్యాంక్ అకౌంట్ వివరాలను షేర్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇటీవల పాడేరు ఏజెన్సీ పరిధిలో పాదయాత్ర చేపట్టి, అభినయ్ మహారాజ్ అనే పేరుతో సోషల్ మీడియాలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వీడియోలు అప్‌లోడ్ చేస్తూ హడావుడి చేయడంతో సోషల్ మీడియాలో చర్చనీయంశమయ్యాడు. అది చాలదనుకున్నాడో ఏమో మరో డ్రామా పండించాలని చూశాడు. కాగా, మే 18న జీ.కే. వీధి మండలం మొండిగెడ్డ వద్ద నలుగురు ముసుగు దొంగలు తనపై దాడి చేశారంటూ స్వల్ప గాయాలతో చింతపల్లి ఏరియా హాస్పిటల్ లో చేరి నాటకీయ పరిణామాలకు తెరలేపాడు. పాస్టర్ వృత్తిని, సామాజిక సేవను అడ్డం పెట్టుకుని పెళ్లిళ్ల పేరుతో మహిళలను మోసం చేస్తున్న ఈ కిలాడి పాస్టర్ బాగోతాలు బయటపడడంతో కథ అడ్డం తిరిగింది.
ఈ కీలక పరిణామాలతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. మరింత లోతైన ఇన్వెస్టిగేషన్ చేపడుతున్నారు. రాష్ట్రంలో అనవసర రాద్ధాంతం చేసేందుకు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఓ పార్టీకి చెందిన కొందరు నేతలు పని గట్టుకుని కుట్రలకు పాల్పడుతున్నారనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కుట్రలకు తెర తీస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోన్న నేపథ్యంలో పాస్టర్ అభినయ్ వెనుకున్న రాజకీయ కుట్రల కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.