హ్యాట్సాఫ్ జడ్జి గారూ..ఉచిత పథకాలపై కళ్లు తెరిపించే స్పీచ్..!

Spread the love

తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొందరు రాజకీయ నాయకులు పేదరిక నిర్మూలన పేరుతో తీసుకొచ్చిన ఉచిత పథకాలు ఇప్పుడు సమాజాన్ని ఎటు వైపు తీసుకెళ్తున్నాయో అనే ఆందోళన గత కొంత కాలంగా చాలా మందిలో ఉంది.  తాజాగా ప్రభుత్వ ఉచిత పథకాలపై హైకోర్టులో ఒక న్యాయమూర్తి గారు వ్యక్తం చేసిన ఆవేదన, ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. నిజానికి ఉచిత పథకాలు లేదా సంక్షేమ పథకాలు ఎవరికి ఇవ్వాలి? రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఇవ్వాలి. కానీ, నేడు రాజకీయ నాయకులు ఓట్ల కోసం ప్రతి ఒక్కరినీ పేదవాళ్ల జాబితాలో చేర్చేస్తున్నారు. జడ్జిగారు లేవనెత్తిన అతిపెద్ద పాయింట్ ఇదే.  రాష్ట్రంలో ఏకంగా కోటికి పైగా కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయంటే ఈ వ్యవస్థ ఎంతలా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కోటి కుటుంబాలు అంటే సగటున 4 కోట్ల మంది జనాభా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారా? ఇది పచ్చి అబద్ధం. ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు వాడుతూ, ఖరీదైన బైక్‌లపై తిరిగే వాళ్లు సైతం సిగ్గులేకుండా ఫ్రీగా వచ్చే రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నారు. అర్హులైన పేదలకు అందాల్సిన డబ్బును, అనర్హులు దర్జాగా అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితిని చూసి న్యాయస్థానం నివ్వెరపోయింది. 

ప్రభుత్వాలు డబ్బులు పంచుతుంటే.. ప్రజలకు పనిచేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదే ఇప్పుడు వ్యవసాయ రంగానికి అతిపెద్ద శాపంగా మారింది. గ్రామాల్లో ఉదయం లేవగానే బ్యాంక్ అకౌంట్లలోకి ఉచితంగా డబ్బులు పడిపోతుంటే, ఏసీ రూముల్లో పడుకునే అలవాటు చేసుకున్న ప్రజలు.. ఎండలో, బురదలో పొలం పనులు చేయడానికి ఎందుకు వస్తారు?దీని దెబ్బకు అన్నంపెట్టే రైతుకు పొలంలో పనిచేయడానికి కూలీలు దొరకని దుస్థితి దాపురించింది. మన రాష్ట్రంలో కూలీలు దొరక్క.. రైతులు ఏకంగా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి కూలీలను దిగుమతి చేసుకుని పొలం పనులు చేయించుకుంటున్నారు. మన పక్కన ఉన్నవాడు సోమరిపోతులా తయారైతే, పొరుగు రాష్ట్రం వాడు వచ్చి మన ఊర్లో పనులు చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నాడు. ఉచిత పథకాల వల్ల శ్రమదోపిడీ తగ్గిందేమో కానీ, శ్రమ చేసే గుణం మాత్రం మన ప్రజల్లో పూర్తిగా చచ్చిపోయింది అంటూ జడ్జి గారు ఆవేదన వ్యక్తం చేశారు.  ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏకంగా 89వేల  కోట్ల రూపాయలను కేవలం ఈ ఉచిత పథకాలకే  ఖర్చు చేస్తోందంటే.. రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత భయంకరంగా ఉండబోతోందో ఊహించుకోవచ్చు. ఈ 89 వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రాజకీయ నాయకుల జేబుల్లోంచి రావడం లేదు. మీరు, నేను కొనే ప్రతి వస్తువు మీద, వేసే పెట్రోల్ మీద బాదుతున్న పన్నుల ద్వారా వస్తున్న సొమ్ము అది. పన్నులు కట్టేవాడి నడ్డి విరిచి, పనులు చేయకుండా కూర్చునే వాడికి ఫ్రీగా పంచుతున్న ఈ వ్యవస్థతో రాష్ట్రానికి భవిష్యత్తు ఏముంటుంది అని జడ్జిగారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బును రోడ్లు, ఆసుపత్రులు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఐటీ కంపెనీల నిర్మాణం కోసం ఖర్చు చేస్తే.. లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ వస్తున్న ప్రతి రూపాయినీ అకౌంట్లలో బదిలీ చేసుకుంటూ పోతే అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది? పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్యం ఇవ్వాల్సిన ప్రభుత్వాలు.. వారి భవిష్యత్తును తాకట్టు పెట్టి ఈ రోజు ఓట్ల కోసం తాయిలాలు పంచుతున్నాయి. హైకోర్టు న్యాయమూర్తి వ్యక్తం చేసిన ఆవేదన కేవలం ఆయన సొంత ఆవేదన కాదు, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి పన్ను చెల్లింపుదారుడి ఆవేదన  ఇది. ఉచితాలు ఒక స్థాయి వరకు మాత్రమే పేదలను ఆదుకోవాలి, కానీ వారిని శాశ్వతంగా పరాన్నజీవులుగా మార్చకూడదు. ఉచితాలు తీసుకోవడం మన హక్కు కాదు, అది మన భవిష్యత్తుకు ప్రభుత్వాలు వేస్తున్న ఉరితాడు అని ప్రజలు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. కష్టపడి పనిచేసే సంస్కృతిని బతికించుకోకపోతే, రాబోయే రోజుల్లో మన రాష్ట్రాలు దివాలా తీసిన శ్రీలంక, వెనిజులా లాగా మారడం ఖాయం. న్యాయస్థానాలు సైతం ఇంతలా మొత్తుకుంటున్నాయంటే పరిస్థితి ఎంత చేయి దాటిపోయిందో అర్థం చేసుకోండి. ఈ వాస్తవాన్ని ప్రతి పౌరుడు గ్రహించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *