బలూచిస్తాన్‌లో స్వాతంత్య్ర వేడుకలు..కిక్కురుమనని పాకిస్తాన్‌

Spread the love

పాకిస్తాన్‌ దేశ సరిహద్దుల కంటే ఇప్పుడు అంతర్గత భూభాగంలోనే పెను తుఫాను లాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. అందులో అత్యంత ప్రమాదకరమైనది సహజ వనరులతో కళకళలాడుతున్న బలూచిస్తాన్ ప్రాంతంలో రేగుతున్న వేర్పాటువాద ఉద్యమం. వరుస దాడులు ఆ ప్రాంతంలో పరిస్థితులు ఎంతలా దిగజారాయో కళ్ళకు కడుతున్నాయి. కేవలం ఒక్కరోజులో పుట్టుకొచ్చిన సమస్య కాదిది, దశాబ్దాల తరబడి రగులుతున్న అంశం. తమ ప్రాంత ఖనిజ సంపదపై స్థానికులకు కనీస హక్కులు దక్కడం లేదని ఇక్కడి జాతీయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా తమ గొంతు నొక్కుతున్నారనే ఆవేదన వారిలో నూటికి నూరుపాటూ నిజం. దీన్ని కేవలం ఒక సాధారణ తిరుగుబాటుగా కాక, దేశ సమగ్రతకే ముప్పుగా ఇస్లామాబాద్ ప్రభుత్వం చూస్తోంది. కాలం మారుతున్న కొద్దీ ఈ పాత గాయం ఇప్పుడు సరికొత్త రూపంలో పాకిస్తాన్‌ను వెంటాడుతోంది. భౌగోళికంగా చూస్తే పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తానే ఆ దేశానికి అసలుసిసలు కీలక భాగం. ఈ భూభాగంలో గ్యాస్, అపారమైన ఖనిజాలు, విలువైన సహజ వనరులు నిధిలా దాగి ఉన్నాయి. అరేబియా సముద్ర తీరంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గ్వాదర్ పోర్ట్ కూడా ఇక్కడే ఉండటంతో దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనబడే సీపీఈసీ ప్రాజెక్టుకు ఈ ప్రాంతమే ప్రధాన కేంద్రబిందువుగా మారింది. బీజింగ్ పెట్టుబడులకు ఈ ప్రాంతం కంటికి రెప్పలాంటిది. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. భారీ అభివృద్ధి ప్రాజెక్టులు జరుగుతున్నా స్థానిక ప్రజలకు మాత్రం కనీస ఉపాధి లభించడం లేదన్నది బలూచ్ ప్రజల ప్రధాన ఆరోపణ. భూమి, వనరులు, ఉద్యోగ అవకాశాలు పూర్తిగా పరాయిపరం అవుతున్నాయని వారు ఫైర్ అవుతున్నారు. ఇది కేవలం సైన్యం,  మిలిటెంట్ల మధ్య జరిగే సాయుధ పోరు మాత్రమే కాదు. దీని వెనుక దశాబ్దాల రాజకీయ, ఆర్థిక అసంతృప్తులు అగ్గిలా బద్దలవుతున్నాయి. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్య  ప్రధాన శక్తి బలూచ్ లిబరేషన్ ఆర్మీ. గతంలో ఈ సంస్థల దాడులు కేవలం మారుమూల ప్రాంతాలకే పరిమితమయ్యేవి. కానీ కాలక్రమేణా వాటి వ్యూహాలు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది జనవరిలో ఒకే సమయంలో భద్రతా కేంద్రాలు, పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు, జైళ్లపై బలూచ్ దళాలు విరుచుకుపడ్డాయి. దీనికి ప్రతిగా పాక్ భద్రతా బలగాలు జరిపిన సైనిక ఆపరేషన్లలో అనేక మంది మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా ఆగస్టు 12న జరిగిన మరో భారీ సైనిక చర్యలో పది మంది వరకు మిలిటెంట్లు హతమయ్యారని అధికారిక వర్గాలు ప్రకటించాయి. అయితే ఇలాంటి ఘర్షణల మధ్య అమాయక పౌరుల ప్రాణాలు బలవుతున్నాయి. ఈ ఘర్షణల్లో సామాన్య ప్రజల బతుకులు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. 

ఈ మొత్తం సంక్షోభంలో డ్రాగన్ దేశం చైనా పాత్ర అత్యంత కీలకంగా,  ప్రమాదకరంగా మారింది. గ్వాదర్ పోర్ట్ , సీపీఈసీ ప్రాజెక్టుల భద్రత బీజింగ్ పాలకులకు నిద్రలేకుండా చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా బలూచ్ వేర్పాటువాదులు చైనా పౌరులను, వారి నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. తమ అనుమతి లేకుండా తమ ఇంటి నుంచే వనరులను కొల్లగొట్టుకుపోతున్నారని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు బలూచ్ తిరుగుబాటుదారులను ఉక్కుపాదంతో అణచివేయాలి. మరోవైపు అంతర్జాతీయ మిత్రుడైన చైనాకు ఇచ్చిన భద్రతా హామీలను వంద శాతం నెరవేర్చాలనే మీమాంసలో పాక్ పడిపోయింది. ఇటీవల ఈ రాజకీయ ఉద్రిక్తతలకు సరికొత్త చారిత్రక రంగు పులుముకుంది. బలూచ్ జాతీయవాదులు ఆగస్టు 11వ తేదీని తమ అధికారిక ‘బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం’గా అత్యంత ఘనంగా జరుపుకున్నారు. సరిగ్గా దీనికి మూడు రోజుల తర్వాత వచ్చే ఆగస్టు 14వ తేదీని పాకిస్తాన్ తన స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటుంది. బలూచ్ ప్రజలు రోడ్లపైకి వచ్చి వేలాదిగా బలూచ్ పతాకాలను ఎగురవేసి స్వాతంత్ర్య సంబరాలు చేసుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో పాకిస్తాన్ మాత్రం ఈ ప్రాంతం తమ దేశంలో అంతర్భాగమని గగ్గోలు పెడుతోంది. ఒకవైపు ఇస్లామాబాద్ అధికారిక ప్రకటనలు, మరోవైపు బలూచ్ ప్రజల స్వతంత్ర పోరాట నినాదాలు పాక్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.తుపాకి గుళ్లతోనూ, నిర్బంధాలతోనూ ప్రజల గొంతును శాశ్వతంగా అణచివేయలేమని బలూచిస్తాన్ చరిత్ర మరోసారి నిరూపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *