మరోసారి పాక్ ప్రధాని పిచ్చి ప్రేలాపనలు..భారత్ దెబ్బకు మతిలేని మాటలు

Spread the love

పాకిస్తాన్  ప్రధాని భారత్‌పై మరోసారి విద్వేషం చిమ్ముతూ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.  పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం  సందర్భంగా ఇస్లామాబాద్‌లో జరిగిన   యాద్గార్-ఎ-ఫతే  కార్యక్రమంలో ఆ దేశ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్  మరోసారి ఇష్టారీతిన ప్రేలాపనలు చేశారు. భారత్‌ ను ఉద్దేశించి ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు దేశాల మధ్య మళ్లీ అగ్గి రాజేస్తున్నాయి. సింధు జలాల అంశంలో ప్రతి నీటి చుక్క తమకు రెడ్ లైన్ అని ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత ఉద్రిక్తంగా మారేలా ఉన్నాయనే చర్చ నడుస్తోంది. అంతేకాకుండా, గత ఏడాది జరిగిన ఆపరేషన్ సింధూర్ ను కూడా ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. పాకిస్తాన్ వ్యవసాయానికి, తాగునీటికి ప్రధాన ఆధారం సింధు నదీ జలాలు. గతంలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం నదీ జలాల పంపిణీ జరుగుతున్నప్పటికీ.. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న నేపథ్యంలో భారత్ తన వైఖరిని కఠినం చేసింది.ఇదే విషయాన్ని షాబాజ్ షరీఫ్ తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ.. భారత్ తన వైఖరి మార్చుకోకపోతే తాము తగిన విధంగా బుద్ధి చెబుతామని ప్రగల్భాలు పలికారు. పాకిస్తాన్‌కు చెందిన ప్రతి నీటి చుక్కా మాకు రెడ్ లైన్ లాంటిది. ఆ నీటిని ఆపే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరిక ధోరణితో మాట్లాడారు.  2025 ఏప్రిల్‌లో పహల్గామ్  వద్ద పాక్ ఉగ్రవాదులు దారుణమైన దాడికి తెగబడిన విషయం మనకు తెలిసిందే. దానికి ప్రతీకారంగానే భారత్ సింధు జలాల పంపిణీని తక్షణం నిలిపివేసింది. అంతేకాకుండా, ఎల్వోసీ  వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం అత్యంత పకడ్బందీగా ఆపరేషన్ సింధూర్  ను చేపట్టింది. ఆ ఆపరేషన్‌లో పాక్ ఉగ్రమూకల నడుములు విరిచేసింది. ఆ మే 2025 నాటి ఘర్షణను గుర్తుచేసుకున్న షాబాజ్ షరీఫ్.. భవిష్యత్తులో తమ దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు సవాలు ఎదురైతే గతంలో కంటే మరింత తీవ్రమైన బలంతో ప్రతిస్పందిస్తామని బీరాలు పోయారు.

తన ప్రసంగంలో షాబాజ్ షరీఫ్ చేసిన మరో ఆసక్తికరమైన కామెంట్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న సమయంలో.. కాల్పుల విరమణ కుదర్చడంలో డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని ఆయన క్రెడిట్ మొత్తం అమెరికాకు ఇచ్చేశారు.కానీ వాస్తవానికి, కాశ్మీర్ లేదా పాకిస్తాన్‌తో ఉన్న సరిహద్దు వివాదాల్లో మూడో పక్షం  మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎప్పుడూ అంగీకరించదు. కాల్పుల విరమణ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించిందన్న పాకిస్తాన్ వాదనను భారత్ ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. కేవలం అమెరికా మెప్పు పొందడానికే షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారని దౌత్య నిపుణులు భావిస్తున్నారు. ఇక ఎప్పట్లాగే పాకిస్తాన్ తమ ఆల్ వెదర్ ఫ్రెండ్ అయిన చైనాను ఆకాశానికెత్తేసింది. ప్రతి కష్టకాలంలోనూ చైనా తమకు అండగా నిలిచిందని, పాకిస్తాన్-చైనా స్నేహం హిమాలయాల కంటే ఉన్నతమైనది అంటూ షరీఫ్ కితాబిచ్చారు. దీనితో పాటు సౌదీ అరేబియాతో ఇటీవల కుదిరిన రక్షణ ఒప్పందం, అందులో టర్కీ భాగస్వామ్యాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ మూడు ఇస్లామిక్ దేశాల కలయిక ప్రాంతీయ శాంతికి ఒక సందేశం అని ఆయన చెప్పుకొచ్చారు. ఇమొత్తంగా చూస్తే.. షాబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు ఒక పక్క శాంతి, సంయమనం గురించి ప్రస్తావిస్తూనే.. మరో పక్క భారత్‌కు గట్టి హెచ్చరికలు చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా సింధు జలాల అంశంతో పాటు  ఆపరేషన్ సింధూర్  నాటి ఘర్షణను ప్రస్తావించడం ద్వారా.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ ఇంకా కంటిన్యూ అవుతోందనే సంకేతాలు ఇచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *