కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గవర్నర్ పదవులను భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు గవర్నర్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకులకు రాజ్యాంగ పదవులు ఇవ్వడం ద్వారా పార్టీకి మేలు జరుగుతుందని అగ్రనేతలు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో ప్రస్థానం ప్రారంభించిన నల్లారి కుటుంబం దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ నేతగా వెలిగారు. ఆ తర్వాత కాలంలో రాజకీయ సమీకరణాలు మారడంతో కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర కోసం పోరాడి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇక తదనంతర పరిణామాలతో బీజేపీలో చేరిన ఆయన,2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఓటమి చెందినప్పటికీ పార్టీ పట్ల విధేయత చూపుతూ వస్తున్న ఆయనకు ఇప్పుడు అత్యున్నత రాజ్యాంగ పదవి దక్కనుందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది.
ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా, శాసనసభాపతిగా కూడా ఆయన నిబద్ధతతో బాధ్యతలు నిర్వర్తించారు. క్రియాశీలక రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నప్పటికీ, ఆయనకున్న అపార అనుభవాన్ని కేంద్రం గుర్తించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ నియామకం పట్ల సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరోవైపు తెలుగుదేశం పార్టీ కోటాలో మరొకరికి కూడా గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే పార్టీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ఇప్పుడు మరో కీలక రాష్ట్ర బాధ్యత టీడీపీ ఖాతాలో పడనుంది. ఈ రేసులో మాజీ మంత్రి ప్రతిభా భారతితో పాటు శాసనసభ మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎవరికి ఆ అదృష్టం దక్కుతుందనే దానిపై టీడీపీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
వచ్చే నెలలో కేంద్ర కేబినెట్ విస్తరణతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పులు కూడా ఒకేసారి జరగనున్నట్లు సమాచారం. హస్తిన రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ నెల రాజకీయంగా అత్యంత కీలకంగా మారనుంది. మొత్తంగా చూస్తే గవర్నర్ల నియామకాల అంశం మరోసారి జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. పదవీకాలం పూర్తవుతున్న గవర్నర్ల స్థానంలో కొత్త వారిని నియమించాల్సిన అవసరం కేంద్రం ముందుంది. ఈ నేపథ్యంలో బీజేపీతో పాటు మిత్రపక్షాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. సీనియర్ నేతలకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఇవ్వడం ద్వారా వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలన్న ఆలోచన ఉండొచ్చని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏపీ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనేది కేంద్రం అధికారికంగా ప్రకటించే వరకు సస్పెన్స్‌గానే ఉంటుంది. చూడాలి ఇవన్నీ ఊహాగానాలేనా లేక ఆ దిశగా నిర్ణయాలు ఉంటాయా అనేది. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి దక్కుతుందా.. టీడీపీ నుంచి ఆ ఛాన్స్ ఎవరికి వస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. సెప్టెంబర్‌లో కేంద్రం తీసుకునే నిర్ణయాలతో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తోంది.