ఇమ్రాన్ తనయుల కామెంట్స్ తో ఇరకాటంలో పాక్

Spread the love

పాకిస్తాన్ తమ  మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విషయంలో  ఇరకాటంలో పడింది. ఒక క్రికెట్ హీరోగా దేశానికి వరల్డ్ కప్ అందించి, ప్రధానిగా పనిచేసిన ఇమ్రాన్ ఖాన్ జీవితం ఇప్పుడు జైలు గోడల మధ్య ప్రాణాపాయ స్థితిలో ఉండటం విషాదకరమని చర్చ జరుగుతున్న వేళ ఇమ్రాన్ ఖాన్‌ ను జైల్లోనే అంతం చేయడానికి ప్రస్తుత పాక్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందంటూ ఆయన కుమారులు సులేమాన్, ఖాసీం చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంశమయ్యాయి. ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సందర్భంగా.. లార్డ్స్ మైదానంలో నేరుగా స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్ట్‌ లో ఈ ఆరోపణలు చేయడం పాకిస్తాన్ ప్రభుత్వానికి గట్టిదెబ్బే. లండన్‌ లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్-పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ హై-డ్రామా చోటుచేసుకుంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ ఆథర్టన్.. ఇమ్రాన్ ఖాన్ కుమారులైన సులేమాన్, ఖాసీంలను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ ప్రసారం కాకుండా ఆపడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు  తీవ్రంగా ప్రయత్నించింది. బ్రాడ్‌కాస్టర్లపై విపరీతమైన ఒత్తిడి తెచ్చింది. కానీ, ఆ స్పోర్ట్స్ ఛానెల్ పాక్ బోర్డు అభ్యంతరాలను ఏమాత్రం లెక్కచేయకుండా ఇంటర్వ్యూను లైవ్‌లో ప్రసారం చేసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది క్రికెట్ అభిమానులు చూస్తున్న వేదికపైనే, తమ తండ్రి ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు గురించి ఇమ్రాన్ కొడుకులు సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం క్షణాల్లో గ్లోబల్ ట్రెండ్‌గా మారిపోయింది. ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ చిన్న కుమారుడు ఖాసీం అత్యంత తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తమ తండ్రిని సాధారణ ఖైదీలా కాకుండా, ప్రాణాలు తీసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

పాకిస్తాన్‌ లో గతంలో ఎంతో మంది రాజకీయ ఖైదీలు, ప్రత్యర్థులు జైళ్లలోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మా నాన్నకు కూడా అలాగే చేయాలని  ప్రస్తుత ప్రభుత్వం చూస్తోంది అంటూ ఖాసీం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు.  సరైన సాక్ష్యాధారాలు లేకుండా కేవలం రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు బనాయించారని, ఎన్నికల్లో ఆయన ప్రజాదరణను చూసి భయపడే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డాడు. రోజులో దాదాపు 23 గంటల పాటు ఒక చిన్న, ఇరుకైన చీకటి గదిలో ఒంటరిగా నిర్బంధిస్తూ  ఆయనను తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేస్తున్నారని తెలిపాడు. కనీస వసతులు కల్పించకపోవడమే కాకుండా, కుటుంబ సభ్యులతో మాట్లాడిన ప్రతిసారీ జైలు సిబ్బంది నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారని, జైలు పరిస్థితులు రోజురోజుకూ మరింత దిగజారుతున్నాయని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా తమకు చెప్పినట్లు ఖాసీం వివరించాడు.  70 ఏళ్లు దాటిన ఒక మాజీ ప్రధాని పట్ల, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఒక లెజెండరీ స్పోర్ట్స్ పర్సన్ పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించడం పాకిస్తాన్ తీరుపై సర్వత్రా విమర్శలకు కారణమవుతోంది. బ్రిటన్, యూరప్, అమెరికాలోని మానవ హక్కుల వేదికలు, అంతర్జాతీయ మీడియా ఈ వార్తను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించే సంస్కృతికి పాకిస్తాన్  ఎప్పుడు చరమగీతం పడుతుందనే ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్నాయి. మరి లార్డ్స్ వేదికగా ఇమ్రాన్ ఖాన్ కుమారులు చేసిన ఈ సంచలన ఆరోపణలపై పాక్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *