నటులు రాజకీయాల్లోకి వచ్చి అనతి కాలంలోనే ప్రభంజనం సృష్టించడం ఒక మూడు నాలుగు దశాబ్దాల క్రితం చూశాం. రాజకీయాల్లో ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి, ముఖ్యమంత్రి స్థానానికి ఎదగాలంటే ఎన్నో ఏళ్ల పోరాటం కావాలి. కానీ తమిళనాడు రాజకీయాల్లో మాత్రం మళ్లీ ఆ ఫీట్ ను అందుకుని సంచలనం సృష్టించాడు విజయ్. సినిమా హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దళపతి విజయ్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రెండేళ్లలోనే సీఎం పీఠాన్ని అధిరోహించి దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించారు. తాజాగా ఇండియా టుడే – సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో.. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తర్వాత.. దేశంలో తదుపరి ప్రధానమంత్రి అభ్యర్థిగా విజయ్ ఏకంగా మూడో స్థానంలో నిలవడం ఇప్పుడు దేశ రాజకీయాలలో చర్చనీయంశమైంది. ఈ లిస్టులో యథావిధిగా నరేంద్ర మోదీ 48.7 శాతం మద్దతుతో మొదటి స్థానంలో నిలవగా, రాహుల్ గాంధీ 27.1 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. అయితే ఇక్కడ ఎవరూ ఊహించని విధంగా తమిళగ వెట్రి కళగం అధినేత, తమిళనాడు సీఎం విజయ్ ఏకంగా 9.2 శాతం మద్దతుతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి రెండేళ్లు కూడా పూర్తికాకముందే, ప్రధాని అభ్యర్థిగా విజయ్ పేరు ఇంత బలంగా వినిపించడం మామూలు విషయం కాదు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేవలం 2 శాతంతో, అఖిలేష్ యాదవ్ 1.7 శాతంతో, అరవింద్ కేజ్రీవాల్ 1.2 శాతంతో విజయ్ కంటే ఎంతో వెనుకబడిపోవడం గమనార్హం. కేవలం ప్రధానమంత్రి అభ్యర్థిగానే కాకుండా ఈ సర్వేలో అడిగిన మరో కీలకమైన ప్రశ్నకు కూడా ప్రజలు సమాధానం ఇచిన చే తీరు అద్భుతంగా ఉంది. ప్రస్తుత ప్రతిపక్ష నేతల్లో ఇండియా కూటమికి నాయకత్వం వహించేందుకు ఎవరు సమర్థులు? అని సర్వే సంస్థ ప్రజలను అడిగింది. ఈ విభాగంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 29 శాతంతో అగ్రస్థానంలో నిలవగా.. విజయ్ ఏకంగా 12.2 శాతం మద్దతు కూడగట్టుకుని ఇక్కడ కూడా రెండో స్థానంలో నిలిచాడు. ఆయన తర్వాత మమతా బెనర్జీ , కేజ్రీవాల్ , అఖిలేష్ యాదవ్ వరుస స్థానాల్లో ఉన్నారు. అంటే ఉత్తర భారతదేశంలో బలమైన పునాదులు ఉన్న ప్రాంతీయ పార్టీల నేతల కంటే.. దక్షిణ భారతదేశంలో, అది కూడా కేవలం తమిళనాడుకే పరిమితమైన ఒక కొత్త ముఖ్యమంత్రిపై దేశ ప్రజలు ఇంత ఆసక్తి చూపించడం విజయ్ పాపులారిటీ ఎలా ఉందో చెబుతోంది. 2024లో టీవీకే పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్.. ఆ తర్వాత రెండేళ్లలోనే జరిగిన తొలి ఎన్నికల్లోనే ప్రభంజనం సృష్టించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎం సీటులో కూర్చోగానే ఆయన కేవలం రాష్ట్రానికే పరిమితం కాలేదు. తొలి ఏడాది పాలన కూడా పూర్తికాకముందే తన పార్టీ విస్తరణ కోసం ఇతర రాష్ట్రాల పైనా దృష్టి సారించారు. ఇటీవల టీవీకే నేతలు చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలు చూస్తుంటే.. వాళ్ళ అసలు టార్గెట్ 2029 లోక్‌సభ ఎన్నికలే అని స్పష్టంగా అర్థమవుతోంది. అంతే కాదు రీసెంట్ల గా జరిగిన తమిళనాడు అసెంబ్లీలో టీవీకే మంత్రి శరత్ కుమార్ విజయ్ తమ భవిష్యత్ ప్రధాని అని బహిరంగంగా ప్రకటించారు. అంతకుముందే మరో మంత్రి ఆధవ్ అర్జున కూడా.. దేశానికి దక్షిణాది నుంచి ప్రధాని రావాల్సిన అవసరం ఉంది, ఆ నాయకుడు తమిళనాడు నుంచే ఎదగాలి అని చెప్పడంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు తగ్గట్టుగానే తాజా సర్వే ఫలితాలు రావడంతో టీవీకే శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. 2029 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. సర్వేలో కనిపించిన ఈ అద్భుతమైన ప్రజాదరణను, దేశవ్యాప్తంగా ఓట్లుగా , సీట్లుగా మార్చుకోవడం విజయ్‌కు ఒక అతిపెద్ద సవాల్. జాతీయ స్థాయిలో ఒక కూటమిని ఏర్పాటు చేయడం, ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు చేరువ కావడం అంత తేలికైతే కాదు. అయినప్పటికీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రెండేళ్లలోనే ప్రధాని రేసులో నిలబడటం మాత్రం భారత రాజకీయ చరిత్రలో చెప్పుకోదగ్గ అంశమే.