భారత్ చేతికి ‘జావెలిన్ మిస్సైల్’…అమెరికాతో సూపర్ డీల్

Spread the love

శత్రువుల యుద్ధ ట్యాంకులను గురిచూసి పేల్చేసే ఒక సూపర్ పవర్ ఫుల్ వెపన్ ను  కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధమైంది. ఆ పవర్ ఫుల్ వెపన్ పేరే జావెలిన్ మిసైల్. సైనికులు భుజంపై పెట్టుకుని ప్రయోగించే ఈ మిస్సైల్ టెక్నాలజీ ప్రపంచంలోనే బెస్ట్ అని చెబుతున్నారు. మరి ఈ అడ్వాన్స్డ్ మిస్సైల్  కొనుగోలు చేయడానికి అమెరికాతో డీల్ కుదిరింది. భారత సైన్యాన్ని మరింత ఆధునీకరించే దశలో కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అమెరికా నుంచి ఈ జావెలిన్ మిస్సైల్స్ కొనుగోలు చేసేందుకు భారత్‌కు అధికారిక ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని మన దేశంలో ఉన్న అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్వయంగా వెల్లడించారు. యూఎస్ ఫారిన్ మిలిటరీ సేల్స్ ప్రక్రియలో భాగంగా.. ఈ మిస్సైల్స్  కొనుగోలుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ పై భారత సైన్యం తాజాగా సంతకం చేసింది. అయితే,  ఇండియా-అమెరికా డీల్ లో భాగంగా మన దేశం ఎన్ని క్షిపణులను కొనుగోలు చేస్తోంది? దానికి అయ్యే మొత్తం ఖర్చు ఎంత? అన్న వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా ఇంకా అధికారికంగా తెలుపలేదు. ఇక ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య ఉన్న సమర్థవంతమైన ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. 

ఈ జావెలిన్ మిస్సైల్ ఒక యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్. అంటే శత్రువుల యుద్ధ ట్యాంకులను సర్వనాశనం చేయడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఆయుధం. ఇక దీనిని  ప్రయోగించడానికి పెద్ద పెద్ద లాంఛర్ వెహికల్స్ తో పని లేదు. కేవలం ఒక సైనికుడు తన భుజంపై ఉంచుకుని శత్రు ట్యాంకుల పైకి గురిపెట్టి సులభంగా ప్రయోగించవచ్చు.  ఈ సిస్టమ్ లో 3.7 అడుగుల క్షిపణి, ఒక డిస్పోజబుల్ లాంఛ్ ట్యూబ్,  ఒక కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. దీనికి ఒకసారి టార్గెట్ సెట్ చేసి ఫైర్ చేశాక.. అది ఆటోమాటిక్ గా వెళ్లి శత్రువుల ట్యాంకును బూడిద చేస్తుంది. దీనినే సైనిక పరిభాషలో ఫైర్ అండ్ ఫర్గెట్ టెక్నాలజీ అంటారు. కచ్చితమైన గురి, ఈ మిస్సైల్  సొంతం. 

అలాగే ఈ మిస్సైల్ సిస్టమ్ కు సాఫ్ట్ లాంచ్ టెక్నాలజీ ఉంది. అంటే ట్యూబ్ నుంచి మొదట ఒక మోటార్ ద్వారా క్షిపణి సైలెంట్ గా కొంతదూరం బయటకు విసురబడుతుంది. ఆ తర్వాత గాల్లోనే అసలైన క్షిపణి మోటార్ ఆన్ అయ్యి కంప్యూటర్ కంట్రోల్ తో టార్గెట్ వైపు వేగంగా దూసుకెళుతుంది. దీంతో మిస్సైల్ ఎక్కడి నుంచి ప్రయోగించారో శత్రువుకు తెలీదు.  ఆధునిక యుద్ధ ట్యాంకులకు రీయాక్టివ్ ఆర్మర్ అనే ప్రొటెక్షన్ ఫీల్డ్  ఉంటుంది. జావెలిన్ మిస్సైల్ లో రెండు దశల్లో పేలేలా పదార్థాలను అమర్చారు. తొలిదశలో ఆ కవచాన్ని బద్దలు కొడుతుంది. ఆ వెంటనే రెండో దశలో ఉండే వార్‌హెడ్ నేరుగా ట్యాంక్ లోపలికి చొచ్చుకుపోయి ధ్వంసం చేస్తుంది. అత్యంత క్లిష్టమైన ఈ టెక్నాలజీని అమెరికాకు చెందిన రక్షణరంగ దిగ్గజాలు రేథియాన్ , లాక్‌హీడ్ మార్టీన్ సంస్థలు డెవలప్ చేశాయి. ఒక్కో మిస్సైల్  ధర దాదాపు 2 లక్షల డాలర్ల వరకు ఉంటుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ యాంటీ-ట్యాంక్ మిస్సైల్ గా పేరున్న జావెలిన్ ఇప్పుడు భారత ఆర్మీ చేతికి రావడం మన ఆయుధ శక్తిని మరింత పెంచేలా చేస్తుందని రక్షణా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *